Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం సృష్టించిన అమ్మాయికి ఇలా అయిందేంటి?

By:  Tupaki Desk   |   3 Sep 2018 2:35 PM GMT
సంచ‌ల‌నం సృష్టించిన అమ్మాయికి ఇలా అయిందేంటి?
X
కేరళలోని త్రిస్సూర్ జిల్లా మాదవన ప్రాంతానికి చెందిన నిరుపేద డిగ్రీ విద్యార్థిని హనన్ హమీద్ ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కిన సంగ‌తి తెలిసిందే. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్న హనన్ ఉద యం 3 గంటలకు నిద్రలేచి జీవనపోరాటాన్ని ప్రారంభిస్తుంది. గంటసేపు చదువుకున్న తర్వాత సైకిల్‌పై మార్కెట్‌ కు వెళ్లి చేపలను కొనుగోలు చేస్తుంది. వాటిని తీసుకొని కోచిలోని తమ్మనం వెళ్తుంది. అక్కడ తెలిసిన వారి ఇంట్లో ఆ చేపలను ఉంచి కాలేజీకి వెళ్తుంది. సాయంత్రం మళ్లీ తమ్మనం చేరుకొని చేపలను తీసుకొని రోడ్డుపై అమ్ముతుంది. ఇంటికి కాలేజీకి మధ్య 60కిలోమీటర్ల దూరం ఆమె అంటే రోజుకు 120 కిలోమీటర్లు ఆమె సైకిల్‌ పైనే ప్రయాణిస్తున్నది. ఆమె కష్టాన్ని ఓ పత్రిక వెలుగులోకి తేవడంతో హనన్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఆమె చేపలు అమ్మే ఫొటోలు వైరల్ అయ్యాయి.

అలా వార్త‌ల్లో నిలిచిన హ‌న‌న్ దుర‌దృష్ట‌వ‌శాత్తు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కోజికోడ్‌ లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడం - వెన్నెముకకు బాగా దెబ్బ తగలడంతో ప్రస్తుతం హనన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స కొన‌సాగుతోంది.

కాగా, హ‌న‌న్‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. త‌న జీవితం కోసం ఆమె చేస్తున్న కృషిని అభినందించినవారు కొందరైతే.. ప్రచారం కోసం ఆమె అసత్యాలు చెబుతున్నదని - నటిస్తున్నదని మరికొందరు సామాజిక మాధ్య మాల్లో కారుకూతలకు దిగారు. దీంతో స్పందించిన సీఎం పినరాయి విజయన్ ఆమెకు అండగా నిలిచారు. హనన్ హమీద్ జీవితం స్ఫూర్తిదాయకం. హనన్ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకుసాగు. కేరళ ప్రజలంతా నీవెంటే ఉంటారు అని ఫేస్‌బుక్‌లో విజయన్ పోస్ట్ చేశారు. ఆమెపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హనన్ స్ఫూర్తిదాయక జీవితం గురించి తెలుసుకున్న మలయాళ డైరెక్టర్ అరుణ్ గోపి.. త్వరలో తీయనున్న సినిమాలో విద్యార్థినికి ఓ పాత్ర ఇవ్వనున్నట్లు చెప్పారు. తనపై వస్తున్న విమర్శలకు హనన్ స్పందిస్తూ.. నా బతుకుదెరువు కోసం చేపలు అమ్ముతున్నా. నా బతుకు నన్ను బతకనివ్వండి అని పేర్కొన్నారు. కాగా, ఇటీవ‌లే రాష్ట్రంలోని వరద బాధితుల కోసం రూ.1.5 లక్షలు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తనను ఆదుకునేందుకు దాతలు పంపిన విరాళాలు మొత్తం వరద బాధితులకే ఇవ్వదల్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘ప్రజల నుంచి నాకు అందిన విరాళాలను తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వారంతా కష్టాల్లో ఉన్నారు. నేను వారికి చేయగలిగిన కనీసం సాయం ఇది..’’ అని హనన్ పేర్కొంది.