Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేర‌ళ సీఎం!

By:  Tupaki Desk   |   4 Sep 2018 12:06 PM GMT
సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేర‌ళ సీఎం!
X
కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన కేర‌ళ పున‌ర్ నిర్మాణంపై ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మంత్రివ‌ర్గంతో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే ఆయ‌నీ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఏడాది పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నిర్వ‌హించే ఉత్స‌వాల‌తో పాటు ఆర్ట్ ఫెస్టివ‌ల్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ కేర‌ళ‌.. టూరిజం శాఖ అధ్వ‌ర్యంలో నిర్వ‌హించే అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ప్ర‌తి ఏడాది కేర‌ళీయులు ఘ‌నంగా నిర్వ‌హించే ఓనం వేడుక‌ల‌ను సైతం సీఎం స‌హాయ నిధికి మ‌ళ్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కార‌ణం కేర‌ళ ముఖ్య‌మంత్రి వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్ల‌టం కార‌ణంగా భావిస్తున్నారు. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు అన్న‌వి లేకుండా చూడ‌టం.. వేడుక‌లు.. కార్య‌క్ర‌మాలు లాంటి వాటికి ఖ‌ర్చు చేయ‌కుండా ఉండేలా అన్ని శాఖాధికారుల‌కు ఉత్త‌ర్వులు పంపిన‌ట్లుగా చెబుతున్నారు.

వాస్త‌వానికి ఆగ‌స్టు 14న కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఓన‌మ్ వేడుక‌ల్నినిర్వ‌హించాల్సి ఉంది. కానీ.. ఆ వేడుక‌ల్నినిర్వ‌హించ‌లేదు. దాని కోసం ఖ‌ర్చు చేయాల్సిన మొత్తాన్ని సీఎం స‌హాయ నిధికి మ‌ళ్లించ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. కేర‌ళ పున‌ర్ నిర్మాణానికి వీలుగా దేశ వ్యాప్తంగా నిధుల సేక‌ర‌ణ‌తో పాటు.. యూఏఈ.. ఖ‌తార్.. సౌదీల‌తో పాటు ఒమ‌న్.. బ‌హ్రెయిన్.. సింగపూర్.. మ‌లేషియా.. అమెరికా.. కెన‌డా.. ఆస్ట్రేలియా.. జ‌ర్మ‌నీ.. న్యూజిలాండ్ దేశాల‌నుంచి ఆర్థిక సాయం పొందాల‌న్న ప్ర‌య‌త్నాన్ని ప్ర‌భుత్వం మొద‌లు పెట్టింది. మాట‌ల్లోనే కాదు..చేత‌ల్లోనూ పొదుపు చూప‌టం.. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చు విష‌యంలో ఎంత క‌ఠినంగా ఉండాల‌న్న విష‌యాన్ని కేర‌ళ సీఎంను చూసైనా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాటిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.