Begin typing your search above and press return to search.

దేవుడి సొంత నేల‌పై ఇంత‌టి ప్ర‌కృతి విల‌య‌మా?

By:  Tupaki Desk   |   17 Aug 2018 9:45 AM GMT
దేవుడి సొంత నేల‌పై ఇంత‌టి ప్ర‌కృతి విల‌య‌మా?
X
దేవుడు సొంత‌భూమిగా కేర‌ళ‌కు పేరు. దేవ‌త‌లు మెచ్చిన ప్రాంతంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తారు. ఆ రాష్ట్రంలోని ఇళ్లను చూసినోళ్లు చాలామంది ఆశ్చ‌ర్యానికి గురి అవుతారు. చివ‌ర‌కు ఆ రాష్ట్రంలోని ప‌లు ప‌ట్ట‌ణాలు.. అంద‌మైన ప‌ల్లెల మాదిరిగా క‌నిపిస్తాయి. ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం.. భారీ ఎత్తున క‌నిపించే చెట్ల మ‌ధ్య‌లో ఇల్లు క‌నిపిస్తుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాదిరి కాంక్రీట్ జంగిల్ గా అస్స‌లు క‌నిపించ‌దు. నేటికీ.. చుట్టూ విశాల‌మైన స్థ‌లంలో మ‌ధ్య‌న ఇల్లు క‌ట్టుకోవ‌టం.. ఇంటికి.. ఇంటికి మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉండ‌టం కేర‌ళ‌లో చాలా చోట్ల క‌నిపిస్తుంటుంది.

ప్ర‌కృతిని ప్రేమించే కేర‌ళీయులు.. ఈ మ‌ధ్య‌న వారి మ‌న‌సులు మారుతున్నాయి. శ‌తాబ్దాల నుంచి అనుస‌రిస్తున్న విధానాల్ని వ‌దిలేసి.. త‌మ‌ను తాము మారిపోతున్న తీరును చూసి ప్ర‌కృతి సైతం త‌ట్టుకోలేక‌పోయింది. పర్యావ‌ర‌ణ హ‌న‌నంతో పాటు.. ప్ర‌కృతి విల‌య‌తాండ‌వంతో కేర‌ళ రాష్ట్రం ఇప్పుడు విల‌విల‌లాడిపోతోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే వ‌ణికిపోతోంది.

సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన నేటి ప‌రిస్థితుల్లో.. గ‌డిచిన ప‌ది రోజులుగా విడ‌వ‌కుండా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా ఆ రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్ష‌రాల 167 మంది. అన‌ధికారికంగా ఈ మ‌ర‌ణాలు మ‌రికొన్ని ఉంటాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఈ భారీ వ‌ర్షాల కార‌ణంగా ఒక్క గురువార‌మే దాదాపుగా వంద మంది వ‌ర‌కూ మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ ఎత్తున మ‌ర‌ణాల‌కు కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం. అదేంటి? ఎప్పుడూ లేని రీతిలో.. కొండ చ‌రియ‌లు ఎందుకు విరిగిప‌డ్డాయి? ఎంత వ‌ర్షం ప‌డితే మాత్రం కొండ చ‌రియ‌లు ఎందుకింత భారీగా విరిగి ప‌డ్డాయ‌న్న ప్ర‌శ్న‌ను వేసుకుంటే.. మ‌నిషి చేసిన పాపం ఇట్టే బ‌య‌ట‌కు వ‌స్తుంది.

తాజాగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ‌లో 1.67ల‌క్ష‌ల మందిని స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్ర‌భుత్వం రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించింది. మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్ అంత్య‌క్రియ‌ల త‌ర్వాత కేర‌ళ‌కు రానున్న ప్ర‌ధాని మోడీ.. శ‌నివారం అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు.

అధికారిక స‌మాచారం ప్ర‌కారం పాడు వ‌ర్షాల కార‌ణంగా జ‌రిగిన ఆస్తి న‌ష్టం రూ.10వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మెట్రో రైలు స‌ర్వీసుల్ని బంద్ చేయ‌టంతో పాటు.. కోచి అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 26 వ‌ర‌కూ మూసివేస్తున్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం శ‌నివారం వ‌ర‌కూ భారీ వ‌ర్షాలు కుర‌వ‌టం ఖాయమంటున్నారు. ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్.. నేవీ.. కోస్ట్ గార్డ్‌.. ఎన్డీఆర్ ఎఫ్ కు చెందిన 52 బెటాలియ‌న్లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలు పంచుకుంటున్నాయి.

ప‌త్త‌నం తిట్టా జిల్లాలోని ర‌న్నీ.. కోజెన్ చెర్నీ ప‌ట్ట‌ణాల్లో వేలాది మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయారు. ఎర్నాకులం.. త్రిసూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీరు 20 అడుగుల మేర నిలిచిపోయిందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు. పంబా న‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌టంతో మూడో మున్నార్ నీట మునిగిపోయింది. దీంతో.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంతో సంబంధాలు కోల్పోయిన ప‌రిస్థితి.

ఇంత తీవ్ర‌స్థాయిలో జ‌ల‌విల‌యం కేర‌ళలో ఎందుకు చోటు చేసుకుంది? దీనికి కార‌ణాలు ఏమిటి? ఎప్పుడూ లేనంత భారీగా వ‌ర్షాలు కుర‌వ‌టం ఎందుకు? రాష్ట్రంలోని 44 న‌దులు పొంగి ప్ర‌వ‌హించ‌ట‌మే కాదు.. అనేక డ్యాముల్ని పూర్తిగా ఎత్తి వేసిన ప‌రిస్థితి. అప్పుడెప్పుడో 1924లో న‌మోదైన భారీ వ‌ర్ష‌పాతం మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఇప్పుడు కుర‌వ‌టం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌ల‌కు కార‌ణాలు వెతికితే షాకింగ్ అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

గ‌డిచిన ప‌ది రోజులుగా కేర‌ళ‌లో కురిసిన భారీ వ‌ర్షాల్ని కొలిస్తే వ‌చ్చే అంకె ఎంతో తెలుసా? అక్ష‌రాల 2వేల మిల్లీమీట‌ర్ల వ‌ర్షపాతం. ఎందుకింత భారీ వ‌ర్షం అంటే.. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాలుగా కేర‌ళ‌లో ప్ర‌కృతి హ‌న‌నం భారీగా సాగుతోంది. ప‌శ్చిమ క‌నుమ‌లు ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా చాలా సున్నిత‌మైన ప్రాంతాలు. వీటిని అత్యంత అపురూపంగా చూసుకోవాల్సి ఉంది. కానీ.. స్వార్థం పెరిగి.. సొమ్ముల మీద ఆశ పెరిగిన ప్ర‌జ‌లు కొండ‌పై ఉన్న ప్రాంతాల్లో విచ్చ‌ల‌విడిగా.. నిర్మాణాలు.. చెట్ల న‌రికివేత‌కు తెర తీశారు.

కేర‌ళ‌లో యూడీఎఫ్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చెట్లు నరికివేయ‌టంతో కొండ ప్రాంతాల్లో చెట్లు భారీగా పోయాయి. దీంతో.. నీటి ప్ర‌వాహం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. కొండ ప్రాంతాల్లో నిర్మించిన క‌ట్ట‌డాల కార‌ణంగా వ‌ర‌ద నీటిని స‌హ‌జ‌సిద్ధంగా నిల్వ‌చేసుకునే త‌త్వాన్ని కొండ‌లు కోల్పోయాయి. విచ్చ‌ల విడిగా సాగిన నిర్మాణాల కార‌ణంగా కొండ ప్రాంతాలు బ‌ల‌హీనంగా మారి.. కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టానికి కార‌ణ‌మ‌య్యాయి. ప్ర‌కృతికి మ‌నం ఎంత చేస్తామో.. ప్ర‌కృతి సైతం మ‌న ప‌ట్ల కూడా అంతే దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌న‌టానికి కేర‌ళ తాజా ఎగ్జాంఫుల్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.