Begin typing your search above and press return to search.

కులాంత‌ర వివాహితుల‌కు సేఫ్ హోంలు - ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   5 March 2020 1:05 PM GMT
కులాంత‌ర వివాహితుల‌కు సేఫ్ హోంలు - ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం!
X
కులాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించ‌డానికి కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు వివిధ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏవో క్యాష్ ప్రైజ్ లు ఇస్తున్నారు. కులాంత‌ర వివాహాల‌కు కొద్ది మొత్తాన్ని కానుక‌గా ఇస్తున్నారు. అయితే భార‌త‌దేశంలో కులాంత‌ర వివాహం అంత తేలిక కాదు. ఎలాంటి ఆర్థిక ప‌రిస్థితుల్లో ఉన్న వారికి అయినా కులాంత‌ర వివాహం క‌ష్ట‌మే. అయితే సౌతిండియాలో ఈ ప‌రిస్థితి కొంత వ‌ర‌కూ మారింది.

ఉన్న‌త భావాలున్న వాళ్లు కొంద‌రు కులాంత‌ర వివాహం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా బ‌లీమ‌య‌న స్థితిలో ఉన్న వారు కూడా కొంద‌రు కులాంత‌ర వివాహాల‌కు ప్రిఫ‌ర్ చేస్తున్నారు. చాలా మంది సినీ ప్ర‌ముఖులు - రాజ‌కీయ నేత‌ల పిల్ల‌ల‌కు కులాంత‌ర వివాహాల‌ను స‌మాజం గ‌మ‌నిస్తూ ఉంది.

అయితే ఇప్ప‌టికీ ప‌రువు హ‌త్య‌లు జ‌రిగే దేశం మ‌న‌ది. కులాంత‌ర వివాహం చేసుకున్నార‌ని - పిల్ల‌ల‌ను చంపిస్తున్న త‌ల్లిదండ్రులు కూడా చాలా మంది వార్త‌ల‌కు ఎక్కుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో కేర‌ళ ప్ర‌భుత్వం ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది. కులాంత‌ర వివాహం చేసుకుని - పేరెంట్స్ ఇబ్బందులు ప‌డుతున్న వారికి ప్ర‌త్యేకంగా ఆశ్ర‌యం క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం రెడీ అవుతోంది. అందుకోసం సేఫ్ హోం ల‌ను ప్రారంభిస్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం.

కులాంత‌ర వివాహాలు చేసుకున్న కొన్ని జంట‌ల‌కు పేరెంట్స్ నుంచి - బంధువుల నుంచి ఇబ్బందులు ఎద‌ర‌వుతూ ఉంటాయి. అలాంటి భ‌యం ఉన్న వారు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సేఫ్ హోంలలో ఉండ‌వ‌చ్చు. అక్క‌డ ర‌క్ష‌ణ ఏర్పాట్లు కూడా ఉంటాయ‌ట‌. ఇలా కులాంత‌ర వివాహాల ప్రోత్సాహానికి కేర‌ళ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ఈ విష‌యంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారం తీసుకోనుంద‌ట ప్ర‌భుత్వం.