Begin typing your search above and press return to search.

మళ్లీ కళకళలాడనున్న కళంకితుడు!!

By:  Tupaki Desk   |   7 Aug 2017 1:04 PM GMT
మళ్లీ కళకళలాడనున్న కళంకితుడు!!
X
భారత్ క్రికెట్ టీమ్ లో ఒక మంచి బౌలర్ గా ఆడిన శ్రీశాంత్ గుర్తున్నాడా! 2013 ఐపిఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ ను బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా జీవితకాలం బ్యాన్ చేసింది. కానీ ఇన్నాళ్లకు ఆ నిషేధం తొలగిపోనుంది. దీన్ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. సహజన్యాయసూత్రాలకు విరుద్ధం అని పేర్కొంది.

శ్రీశాంత్ తన మీద నిషేధం విధించిన తరువాత... ఒక ఆటగాడిగా ఆ బాధని తట్టుకోలేక తన చాలా రోజులు బీసీసీఐ ని సంప్రదించి, తన బ్యాన్ ని ఎత్తివేయమని కోరాడు. కానీ బీసీసీఐ దానికి అంగీకరించలేదు. తరువాత తను కేరళ హైకోర్టు ని సంప్రదించాడు. తనకు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా తనని ఇంకా వేధిస్తూనే ఉన్నారని, ఇందువలన తన స్పోర్ట్స్ కెరీర్ కూడా దెబ్బతింటున్నాదని శరణుకోరాడు. నేడు కేరళ హైకోర్టు బీసీసీఐ శ్రీశాంత్ జీవితకాలం నిషేధాన్ని రద్దు చేసింది.

అయితే కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినంత మాత్రాన శ్రీశాంత్ కష్టాలు తొలగిపోయినట్లు కాదు. అతని మీద నిషేధం, బీసీసీఐ మాజీ కమిటీ తీసుకున్న నిర్ణయం కావడంతో-- ఇప్పటి కమిటీ తామేమీ చేయలేమని చేతులెత్తేసింది. అయితే కేరళ క్రికెట్ అసోసియేషన్ మాత్రం అతనికి అండగా నిలుస్తోంది. శ్రీశాంత్ ను కీర్తిస్తూ ‘‘తను మా ఆటగాడు... మేము తనకి ఎలప్పుడూ తోడుగా ఉంటాం’’ అని కెసిఏ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

మే 2013 లో పోలీసులు శ్రీశాంత్ ను మరియు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు, అజిత్ చెడిలియా, అంకిత్ చవన్ లను స్పాట్ ఫిక్సింగ్ కేసు లో అరెస్టు చేశారు. ఆ తరువాత బీసీసీఐ శ్రీశాంత్ ను జీవితకాలం పాటు నిషేదించింది. తను కేసులో అరెస్టు అయునప్పుడు తనని నిషేదించడం నేచురల్ జస్టిస్ కి విరుద్ధం అని కేరళ హైకోర్టు శ్రీశాంత్ బ్యాన్ పై ఉపసంహరించింది.

క్రికెట్ నుంచి దూరమైన ఈ స్వింగ్ బౌలర్ తరువాత యాక్టింగ్ అని, పాలిటిక్స్ అని అటు ఇటు కాకుండా పోయాడు. సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. ఎన్నికల్లో కూడా బోల్తా పడ్డాడు. తిరువనంతపురం భాజపా అభ్యర్ధిగా నిలబడి కాంగ్రెస్ అభ్యర్ధి వి. ఎస్. కుమార్ తో ఓడిపోయాడు. ఈమధ్యనే తన ‘‘టీమ్ 5’’ చిత్రం విడుదలైంది. ఇప్పటికి శ్రీశాంత్ కు క్లారిటీ వచ్చిందేమో తెలియదు గానీ.. ‘‘తనకి క్రికెట్ తప్ప మరేదీ ఇష్టం లేదని, తను మళ్లీ స్వింగర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించడం తనకు చాలా సంతోషమని’’ శ్రీశాంత్ భార్య భువనేష్ కుమారీ పేర్కొంది. అయితే ఒకప్పుడు తన కెరీర్ మీద మరకలు పడిన ఈ కళంకిత ఆటగాడు... మళ్లీ మైదానంలో కళకళలాడుతాడో లేదో చూడాలి.