Begin typing your search above and press return to search.

కేరళ పద్ధతులు పాటిద్దాం.. కరోనాను తరమికొడదాం

By:  Tupaki Desk   |   6 March 2020 3:30 AM GMT
కేరళ పద్ధతులు పాటిద్దాం.. కరోనాను తరమికొడదాం
X
ఇప్పుడు ప్రపంచ‌ దేశాలు మరచిపోయి మన దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ పైనే ప్రధాన చర్చ సాగుతోంది. దేశంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ ను కరోనా కంగారు పెడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వైరస్ సోకినా దాన్ని నివారణకు చర్యలు తీసుకుంటే చాలు... కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ప్రజలు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. దీనికి అవగాహన లేకపోవడంతో పాటు సోషల్ మీడియా, మీడియా నానా హడావుడితో ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే కరోనా వైరస్ ఎంత వ్యాప్తి చెందినా దాన్ని నియంత్రణ చేసి కట్టడి చేసిన రాష్ట్రం కేరళ. దేశంలోనే తొలి కరోనా బాధితుడి కేసు కేరళలో వెలుగుచూసింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో కరోనాపై ఎలాంటి కంగారు లేదు. అందుకే ఇప్పుడు అందరూ కేరళ పద్ధతులు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని చెబుతున్నారు. ఈ విషయాన్నే ప్రముఖ పత్రిక లైవ్ మింట్ తన కథనంలో పేర్కొంది. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేరళ ప్రధానంగా 5 మార్గాలను పాటించిందని తెలిపింది. అవి పాటిస్తే దేశం నుంచి కరోనాను తరమికొట్టవచ్చని చెబుతోంది. కేరళ పాటించిన విధానాలు చూద్దాం.

వైరస్ బాధితుల గుర్తింపు
గతంలో కేరళ నిఫా వైరస్ బారిన కూడా పడింది. అయితే ఆ సమయంలో పకడ్బందీ చర్యలు తీసుకుని ఆ వైరస్ నుంచి బయటపడింది. అప్పుడు అవలంభించిన విధానాలు, పద్ధతిని కరోనా వైరస్ నియంత్రణకు కూడా అమలుచేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతోంది. రెగ్యులర్ గా పరీక్షలు చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించింది. అనుమానం ఉన్న ప్రతి రోగిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు వెంటనే చేయిచింది. ప్రతి మూడు గ్రామాలకు రెండు ప్రధాన ఆరోగ్య కేంద్రాలను కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేసింది. ప్రతి 3.95 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సగటున 7.3 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలకు వైద్య పరీక్షలు చేయించింది. అనుభవం ఉన్న వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కేవలం రూ.5 వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మినిమమ్ 40 పడకలను గుర్తించి వాటిని కరోనా బాధితుల కోసం కేటాయించింది. ఆ అనుమానితులు ఉంటే వెంటనే స్థానికంగా చికిత్స అందించి ఆ వైరస్ నియంత్రణకు పని చేసింది.

సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్ :
కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కాగానే వెంటనే కేరళలో సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్ అమల్లోకి తెచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి కలిసిన వ్యక్తులను వెంటనే గుర్తించేలా చర్యలు చేపట్టింది. కరోనాకు మందు లేకపోవడంతో వైరస్ సోకిన వ్యక్తులను సాధ్యమైనంత వరకు మరొకరితో కలవనీయకుండా నిరోధించడానికి విశేష కృషి చేశారు. అక్కడి స్థానిక ఆరోగ్య సిబ్బంది, కేంద్ర వైద్య బృందం, నిపుణులంతా ఒక దళంలా రంగంలోకి దిగి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే వారిని ప్రత్యేకమైన ఆస్పత్రి వార్డుల్లో నిర్బంధించి వైద్య సేవలు అందించేలా చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహించి పాజిటీవ్ అని తేలితే వారిని నేరుగా రాష్ట్రీయ బృందానికి తరలించి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది.

నిరంతర పర్యవేక్షణ
వాటితో పాటు కరోనాను అదుపులో ఉంచేందుకు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడూ కరోనా వ్యాప్తిపై అప్ డేట్స్ తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. మొత్తం 18 మంది నిపుణుల సభ్యులతో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి పర్యవేక్షించారు. విదేశీ శాఖలతో పాటు ఇళ్లల్లోనే నిర్బంధాన్ని ఏర్పాటుచేసింది. లాజిస్టిక్స్, వైద్య సిబ్బందికి ఈ మేరకు శిక్షణ ఇచ్చింది. రోజుకు రెండుసార్లు చొప్పున ఆరోగ్యశాఖ మంత్రి వ్యక్తిగతంగా హాజరై సాయంత్రం 6 గంటలకు సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తూ ఏం అవసరమో అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రతి గ్రామంలో పంచాయతీ అధికారులు, పబ్లిక్ ఆరోగ్య అధికారులతో కలిసి కరోనా పరిస్థితులపై అవగాహన కల్పించారు. స్థానిక ఆరోగ్య అధికారులంతా వైరస్ బాధితులను ఇళ్లల్లోనే 28 రోజుల వరకు నిర్బంధించేలా చర్యలు చేపట్టింది. బాధితులను కంటికి రెప్పలా చూసుకున్నారు. అవసరమైన వైద్య సదుపాయాలతో పాటు నిత్యావసర వస్తువులను కూడా అందించారు.

భయం పారదోలడం
కరోనాను వెళ్లగొట్టడానికి గతంలో నిఫా వైరస్ కు తీసుకున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని కేరళ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ప్రజల్లో భయాందోళన లేకుండా చేసేలా చర్యలు చేపట్టింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. ఒకరికి వైరస్ సోకింది అనగానే బాధితులు, వారి కుటుంబంపై వివక్ష చూపించే పరిస్థితి ఉండడంతో ఆ భయాన్ని పోగొట్టేలా జాగ్రత్త పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో కూడా కరోనా స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేసింది. ప్రజలు భయాందోళన చెందకుండా నిరంతరం నిఘా పెట్టాలని సూచించింది. పౌర సామాజికవేత్తలు కూడా రాష్ట్రమంతటా సందేశాలను పంపుతూ బాధితుల్లో ఎవరిని ఇబ్బందులకు గురిచేయరాదని, వారిని వెంటనే రక్షించాలని చెబుతూ వచ్చారు. రోజులో కనీసం రెండుసార్లు ఆరోగ్య శాఖ మంత్రి టెలివిజన్ కెమెరాల్లో కనిపించి ప్రజలకు భయపడాల్సిన పనిలేదని, వైరస్ కంట్రోల్లోనే ఉందంటూ ధైర్యం చెప్పారు. అనేక కాల్ సెంటర్లను ఏర్పాటుచేసి ప్రజల అనుమానాలను నివృతి చేశారు.

సోషల్ మీడియాపై..
ఏవైనా వ్యాప్తి చెందితే వెంటనే వైరలయ్యేది సోషల్ మీడియాలోనే. ఒక్క విషయం వెంటనే అందరికీ తెలిసేలా ఈ మాధ్యమం ఉన్నా... దీనివలన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి విషయమై కూడా సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చాయి. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు మీడియా కూడా ఇలాంటి తప్పుదు సమాచారాన్ని నియంత్రించేలా కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన మీడియా సంస్థలతో ఆరోగ్య శాఖ మంత్రి సమావేశమై సహకరించాలని కోరారు. అనుమానిత వైరస్ కేసులు, మరణాలపై అధికారిక గణాంకాలను మాత్రమే తెలపాలని చెప్పారు. దీంతో సమష్టి కృషితో ప్రస్తుతం కేరళలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. అక్కడి ప్రజల్లో భయాందోళన లేదు. ఒకవేళ పాజిటివ్ కేసులు ఉన్నా వెంటనే దాని నిరోధానికి చేపట్టే సామర్థ్యం కేరళకు విశేషంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వాతావరణం రావాలని ఆశిద్దాం. అందరూ కలిసి పని చేస్తే ఎలాంటి మహమ్మారినైనా తరమికొట్టవచ్చని కేరళ నిరూపించింది. మనం కేరళ నుంచి స్ఫూర్తి పొంది చర్యలు చేపడతాం... కరోనాను తరమికొడదాం.