Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ.. ఇదీ ఓ సాయమా మోడీ..?

By:  Tupaki Desk   |   19 Aug 2018 5:34 AM GMT
ఛీ..ఛీ.. ఇదీ ఓ సాయమా మోడీ..?
X
దేవుడు న‌డియాడే ప్రాంతంగా కేర‌ళ గురించి త‌ర‌చూ చెబుతుంటారు. అలాంటి పుణ్య‌భూమిని.. మ‌నిషి త‌న స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌కృతి హ‌న‌నం చేస్తే.. అది మాత్రం ఊరుకుంటుందా? ప్ర‌కృతి ఆగ్ర‌హంతో చోటు చేసుకున్న జ‌ల‌విల‌యం కార‌ణంగా ఏర్ప‌డిన న‌ష్టం అంతా ఇంతా కాదు.

త‌ప్పులు చేయ‌టం.. ప్ర‌కృతి శిక్ష విధించ‌టం లాంటి వాటిని ప‌క్క‌న పెడితే.. క‌ష్టం వ‌చ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్ర‌ధాని మోడీకి తెలీదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా స్థిర‌ప‌డుతున్న ఒక యువ క‌థానాయకుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ కుర్రాడు.. కేర‌ళ విల‌యంపై వారం ముందు నుంచే నెత్తినోరూ కొట్టుకుంటున్నాడు. త‌న‌వంతు సాయంగా రూ.5ల‌క్ష‌లను కేర‌ళ‌కు సాయంగా ఇచ్చాడు. అంతేనా.. త‌న‌ను అభిమానించే వారంద‌రిని కేర‌ళ‌కు సాయం చేయాలంటూ సోష‌ల్ మీడియా ద్వారా వేడుకున్నాడు.

ఒక చిన్న హీరో.. ఇంకా చెప్పాలంటే త‌న సొంతింటిని ఈ మ‌ధ్య‌నే కొనుక్కున్న న‌టుడు.. కేర‌ళకు వ‌చ్చిన క‌ష్టానికి క‌దిలిపోయి రూ.5ల‌క్ష‌లు సాయంగా అందిస్తే.. దేశ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న మోడీ కేర‌ళ‌కు అందించాల్సిన సాయం ఎంత ఉండాలి?

ఓప‌క్క కష్టాల సుడిగుండంలో చిక్కుకొని విల‌విల‌లాడుతున్న‌వేళ‌.. కేంద్రం ప్ర‌క‌టించిన సాయం వింటే ఒళ్లు మండ‌క మాన‌దు. రాష్ట్రాలు త‌మ ఆదాయంలో వాటాగా కేంద్రానికి ఇచ్చే మొత్తాన్ని.. క‌ష్టంలో ఉన్న రాష్ట్రానికి అందించే విష‌యంలో అంత ఆచితూచి ఏమిటి?

ఇప్పుడు వినిపిస్తున్న అంచ‌నా ప్ర‌కారం తాజా వ‌ర్షాల కార‌ణంగా కేర‌ళ‌కు జ‌రిగిన ఆర్థిక న‌ష్టం దాదాపు రూ.35వేల కోట్ల‌కు పైనే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. కేర‌ళ‌కు కేంద్రం అందించే త‌క్ష‌ణ సాయం రూ.100 కోట్లు ఏమిటి? రూ.వెయ్యి కోట్లు ఇస్తే మాత్రం త‌ప్పేమిటి? డ‌బ్బులు అన్న‌వి క‌ష్టంలో ఉన్న‌ప్పుడు ఖ‌ర్చు చేయాలి. అలా కాకుండా డ‌బ్బు ఉన్నా ప్ర‌యోజ‌నం ఏమిటి?

విజ‌య్ దేవ‌ర‌కొండ స్థాయితో పోలిస్తే.. కేంద్రం ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ‌? పోలిక కాస్త బాగోలేకున్నా.. విశాల దృక్ఫ‌దంతో ఆలోచించిన‌ప్పుడు క‌ష్టంలో ఉన్న కేర‌ళీయుడికి ప్ర‌ధాన‌మంత్రి హోదాలో ఉన్న మోడీ.. కేంద్రం త‌ర‌ఫున అందించాల్సిన సాయం ఎంత ఉండాలి?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కాసేపు ప‌క్క‌న పెట్టేద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సంగ‌తే చూద్దాం. కేర‌ళ క‌ష్టానికి క‌దిలిన ఆయ‌న రూ.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. నిజానికి సంప‌న్న రాష్ట్రాల్లో కేర‌ళ ఒక‌టి. కానీ.. ప్ర‌కృతి విల‌య‌తాండ‌వం చేసిన‌ప్పుడు ఎంత సంప‌న్న ప్రాంత‌మైనా అత‌లాకుత‌ల‌మైపోతుంది. అలాంట‌ప్పుడు చుట్టూ ఉన్న వారు త‌మ వ‌ర‌కు తాము చేత‌నైనంత సాయాన్ని అందించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ చిన్న విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ ఎందుకు మ‌ర్చిపోతారో అర్థ‌మే కాదు.

కేసీఆర్ అంటే సంప‌న్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుకుంటే.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల‌తో ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రూ.5కోట్ల సాయాన్ని ప్ర‌క‌టించారు. అయితే.. కేర‌ళ‌కు జరిగిన న‌ష్టంతో పోలిస్తే.. తాను ప్ర‌క‌టించిన సాయంపై విమ‌ర్శ‌లు రావ‌టం.. ఎట‌కారాల‌తో ఆ మొత్తాన్ని రూ.10కోట్ల‌కు పెంచారు అయిన‌ప్ప‌టికీ విమ‌ర్శ‌ల తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌టంతో కేర‌ళ సీఎంకు ఫోన్ చేసి.. మీకేం అవ‌స‌ర‌మో అది చెప్పండి.. మేం సాయం చేస్తామ‌న్న మాట‌ను చెప్ప‌టం చూసిన‌ప్పుడు.. మోడీ మ‌రెంత సాయం చేయాలి?

ఒక కేర‌ళ ఎమ్మెల్యే కంట‌త‌డి పెడుతూ.. ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు హెలికాఫ్ట‌ర్ల‌ను వెంట‌నే రంగంలోకి దించాల‌న్న మాట‌ను మీడియా ముందు వేడుకున్న వైనం చూస్తే.. కేర‌ళ ఇప్పుడెంత క‌ష్టంలో ఉందో తెలుస్తుంది. అలాంట‌ప్పుడు వ్య‌వ‌స్థ‌లు ఒక్క‌సారిగా కేర‌ళ మీద ఫోక‌స్ చేస్తే.. క‌ష్టాల సుడిగుండంలో ఉన్న కేర‌ళీయుడ్నిఆదుకోవ‌టం పెద్ద క‌ష్ట‌మైన ప‌నా? ఇదంతా చూసిన‌ప్పుడు.. కేర‌ళ‌కు త‌క్ష‌ణ సాయం కింద రూ.100 కోట్ల మొత్తాన్ని కేంద్రం విడుద‌ల చేస్తుంద‌న్న మాట విన్న‌ప్పుడు అప్ర‌య‌త్నంగా నోటి నుంచి.. ఛీ.. ఛీ అన్న మాట ప‌లువురి నోట వస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ గుర్తిస్తే మంచిది.