Begin typing your search above and press return to search.

మంత్రి గారి షాక్: అలీ ఇండియాలో పుట్టాడట

By:  Tupaki Desk   |   5 Jun 2016 9:36 AM GMT
మంత్రి గారి షాక్: అలీ ఇండియాలో పుట్టాడట
X
ఈ మధ్య బీహార్ లో ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లో టాపర్లుగా నిలిచారని తెలిసి.. వాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి ఓ టీవీ ఛానెల్ వాళ్లింటికి వెళ్లింది. టాపర్లలో ఒకరైన అమ్మాయినని.. ‘ఇంతకీ పొలిటికల్ సైన్స్ లో ఏముంటుంది’ అని ప్రశ్నిస్తే.. అందులో వంటల గురించి నేర్పిస్తారని చక్కగా సమాధానం చెప్పి తన ‘విజ్నానం’ బాగానే చాటుకుంది ఆ అమ్మాయి. రెండో టాపర్ కూడా అంతే మరి. ఇలా ఉంటాయి మన చదువులు. మనోళ్ల విజ్నానం. ఇక్కడ ఓ రాష్ట్రానికి క్రీడా మంత్రిగా వ్యవహారం వెలగబెడుతున్న మంత్రిగారి సంగతి చూడండి. నిన్న బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీ చనిపోయిన నేపథ్యంలో ఫుట్ బాల్ అంటే పడి చచ్చే కేరళలో ఆయనకు నివాళి అర్పించడానికి అనేక కార్యక్రమాలు చేశారు. ఓ టీవీ ఛానెల్ ఆ రాష్ట్ర క్రీడల మంత్రి జయరాజన్.. మహ్మద్ అలీ గురించి స్పందించమని అడగ్గా.. అలీ ఇండియాలో.. అది కూడా కేరళలో పుట్టాడని చెబుతూ.. ఆయన మనందరికీ గర్వకారణమని తనదైన శైలిలో లెక్చర్ దంచేయడంతో ఆ ఛానెల్ ప్రతినిధి నివ్వెరపోయాడు.

‘‘బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ కేరళలో జన్మించడం.. రాష్ట్రం తరఫున ఎన్నెన్నో మెడల్స్ సాధించడం మనకు గర్వకారణం. కేరళ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన అలీ మరణం బాధాకరం. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా....’’ అంటూ జయరాజన్ అనర్గళంగా మాట్లాడేస్తుంటే ఆ టీవీ ఛానెల్ ప్రతినిధి ఆయన ప్రసంగానికి అడ్డుకట్ట వేశాడు. అతను ఆపకపోయి ఉంటే ఇంకా మంత్రిగారి నోట ఇంకెన్ని ఆణిముత్యాలు జాలువారేవో. ఐతే మంత్రిగారి ప్రసంగం మీడియాలోకి వెళ్లకుండా చేయడానికి అక్కడి వరకు మ్యూట్ చేసినా సరే విషయం సోషల్ మీడియా వరకు చేరిపోయింది. దీంతో అయ్యవారి మీద సెటైర్లతో రెచ్చిపోయారు నెటిజన్లు. ‘‘టీవీ రిపోర్టర్ ఆపకపోయి ఉంటే మంత్రిగారు అలీ కూతురికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించేవారేమో’’ అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేయడం విశేషం.