Begin typing your search above and press return to search.
ఇక్కడ ఉండలేం భారత్ వచ్చేస్తాం: భారీగా కేరళ ఎన్నారైల రిజిస్ట్రేషన్లు
By: Tupaki Desk | 28 April 2020 12:30 PM GMTకరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని దేశాల్లో తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఆ వైరస్ కట్టడి కోసం అన్ని దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉద్యోగ, ఉపాధి, వ్యాపార కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. దీంతో విదేశాల్లో బతుకు దుర్భరమైంది. దీనికితోడు లాక్‌డౌన్‌తో ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉంది. ఉద్యోగాలు పీకేసే అవకాశం ఉండడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు ఇక్కడ ఉండలేం.. స్వదేశం వస్తామని వినతులు పెట్టుకుంటున్నట్లు సమాచారం. వీరిలో కేరళ రాష్ట్రానికి చెందిన వారు అధికంగా ఉన్నారంట. కేరళ రాష్ట్రానికి రావడానికి ఏకంగా 2 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని సమాచారం.
కరోనా వైరస్ వ్యాప్తితో పాటు ఉద్యోగాలపై అభద్రత ఏర్పడడం తో స్వరాష్ట్రం వచ్చేందుకు కేరళ ప్రజలు ఎదురుచూస్తున్నారంట. ఈ క్రమంలో ఒక్క రోజులోనే దాదాపు 2 లక్షల మంది ప్రవాస కేరళీయులు భారత్ వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నాన్-రెసిడెంట్ కేరలైట్ వ్యవహారాల విభాగం (నార్కా) వైస్ చైర్మన్ వరదరాజన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ముగిసి భారతదేశంలో విమానాశ్రయాలు మొదలైన తర్వాత ఇంటికి రావాలనుకునే వారి కోసం ప్రారంభించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో కేరళ ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ భయాలు, లాక్‌డౌన్‌తో ఆ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోనున్న పరిస్థితులు ఉండడంతో స్వరాష్ట్రం వచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక్కరోజే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 70 వేలమంది, సౌదీ అరేబియా నుంచి 30 వేల మంది కేరళ కు వచ్చేందుకు నమోదు చేసుకున్నారు. 40 శాతానికి పైగా యూఏఈ నుంచి రాగా, మిగిలినవి సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఇతర పెర్షియన్ గల్ఫ్ దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వాటితో పాటు అమెరికా, బ్రిటన్ నుంచి కూడా ఉన్నాయి. అయితే వారందరినీ దశల వారీగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రధామంత్రి నరేంద్రమోదీ దృష్టికి కూడా ఆ ప్రభుత్వం తీసుకువెళ్లిందని సమాచారం. భారత ప్రభుత్వం సహకారంతో తమ రాష్ట్ర ప్రజలను తిరిగి రప్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.