Begin typing your search above and press return to search.

వైర‌ల్ పిక్.. ఆన్ లైన్ క్లాస్-అమ్మాయి కష్టాలు

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:20 AM GMT
వైర‌ల్ పిక్.. ఆన్ లైన్ క్లాస్-అమ్మాయి కష్టాలు
X
క‌రోనా తెచ్చిన క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్ప‌టిదాకా చూడ‌ని ఎన్నో ప‌రిణామాల్ని గ‌త మూడు నెల‌ల్లో చూశాం. ఈ మ‌హ‌మ్మారి తాలూకు ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతోంది. అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీని వ‌ల్ల బాధ ప‌డ‌ని వాళ్లంటూ ఎవ్వ‌రూ లేరు అంటే అతిశ‌యోక్తి కాదేమో. విద్యార్థుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ప‌రీక్ష‌ల కోసం మూడు నెల‌లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. మిగ‌తా త‌ర‌గ‌తుల విద్యార్థుల ప‌రిస్థితి అయోమ‌యంగానే ఉంది. ఇక లాభం లేద‌ని విద్యా సంస్థ‌లు ఆన్ లైన్ క్లాసుల‌తో విద్యార్థుల్ని క‌నెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. విద్యార్థులు ఇంటి నుంచే యాప్‌ల ద్వారా క‌నెక్ట‌యి క్లాసులు వినే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఐతే ప‌ల్లెటూళ్ల‌లో ఉన్న విద్యార్థుల‌కు ఇంట‌ర్నెట్ సిగ్న‌ల్ దొర‌క్క నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

ఆ అవ‌స్థ‌లు ఎలాంటివో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌.. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఒక అమ్మాయి ఫొటో. కేర‌ళ‌కు చెందిన ఆ అమ్మాయి పేరు న‌మిత నారాయ‌ణ‌న్. త‌ను మ‌ల‌ప్పురంలో బీఏ ఇంగ్లిష్ చ‌దువుతోంది. ఆమె కాలేజీ యాజ‌మాన్యం ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఏర్పాటు చేసింది. ఐతే న‌మిత ఇంట్లో సిగ్న‌ల్ స‌మ‌స్య త‌లెత్తి ఈ క్లాసుకు క‌నెక్ట్ కాలేక‌పోయింది. వ‌రండాలో, చుట్టుప‌క్క‌ల తిరిగినా ఫ‌లితం లేక‌పోయింది. చివ‌రికి ఆమె త‌న పెంకుటింటి పై క‌ప్పు మీదికి వెళ్లి అక్క‌డ సిగ్న‌ల్ కోసం ప్ర‌య‌త్నిస్తే అక్క‌డ క‌నెక్ట‌యింది. అక్క‌డే ఉండి ఆమె క్లాస్ వింది. వీధిలో వెళ్తున్న ఓ వ్య‌క్తి మొబైల్ ద్వారా ఆమె ఫొటో తీసి.. ఆన్ లైన్ క్లాసుల క‌ష్టాలు ఇలా ఉన్నాయంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫొటో ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అయిపోయింది.