Begin typing your search above and press return to search.

మోడీ చక్రవర్తి కావాలంటే ఆ మూడే కీలకం

By:  Tupaki Desk   |   13 March 2017 6:23 PM GMT
మోడీ చక్రవర్తి కావాలంటే ఆ మూడే కీలకం
X
యావత్భారత దేశాన్ని ఏలిన చక్రవర్తి ఇంతవరకు లేడు... ఎక్కడో ఏదో ఒక గ్యాప్. చంద్రగుప్త మౌర్యుడు దాదాపుగా భారతావని మొత్తాన్ని పాలించినా ఈశాన్యాన కొద్ది ప్రాంతం.. దక్షిణాన చోళ సామ్రాజ్యం(ప్రస్తుత తమిళనాడు - కేరళల్లోని కొంత భాగం).. తూర్పున కళింగ రాజ్యం(ఒడిస్సా)లను ఏలలేకపోయాడు.

ఆ తరువాత అశోక చక్రవర్తి.. చంద్రగుప్త మౌర్యుడిని మించిపోయాడు.. దాదాపుగా సంపూర్ణ భారతదేశాన్ని పాలించాడు.. చంద్రగుప్త మౌర్యుడి చేతికి చిక్కని కళింగ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి దయానదిలో రక్తపుటేరులు పారించాడు. నాలుగు లక్షల మంది ఉత్కళ ప్రజల తలలు నరికి కళింగను ఆక్రమించాడు. అయితే.. ఆ నరమేధం అతని మనస్సును కలచివేయడంతో రాజ్యకాంక్షను వదిలి ధర్మాన్ని చేపట్టాడు. బౌద్ధమతంలోకి మారిపోయి యుద్ధాలు మానేశాడు. దాంతో చోళ సామ్రాజ్యం - ఈశాన్య ప్రాంతాన్ని పాలించలేకపోయాడు. కళింగ యుద్ధంలో రక్తపుటేరులు పారించినా బౌద్ధం చేపట్టి ఇప్పుడు మన దేశ జెండాలోనూ అశోక ధర్మ చక్రం రూపంలో అందరి నాల్కలపై ఉన్నా భారతదేశం మొత్తాన్ని.. ఒక్క అంగుళం కూడా వదలకుండా పాలించాడన్న ఖ్యాతి దక్కించుకోలేకపోయాడు.

ఆధునిక భారతంలోనూ అలాంటి అవకాశం ఎవరికీ రాలేదు. 1952 నుంచి 62 వరకు నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో అప్పటికి ఇన్ని పార్టీలు లేవు.. ప్రాంతీయ పార్టీలు లేవు.. అయినా, అప్పుడు కూడా నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలనూ పాలించలేకపోయింది. నెహ్రూ టైంలో కేరళలో కొద్దికాలం ప్రజా సోషలిస్టు పార్టీ - కొద్దికాలం సీపీఎం అధికారంలో ఉన్నాయి. అలాగే జమ్మూకాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్సు పాలించేది. ఇలా నెహ్రూ కూడా ప్రధానిగా ఉన్నా యావద్భారతంపై పట్టు సాధించలేకపోయారు.

కానీ.. ప్రస్తుత ప్రధాని - బీజేపీ నేత మోడీ దూకుడు చూస్తుంటే వచ్చే అయిదేళ్లలో ఆయన యావద్భారతంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పరిచేలా కనిపిస్తోందంటున్నారు. అచ్చంగా కాకపోయినా చంద్రగుప్త మౌర్యుడు - అశోకుడు మాదిరిగానే మోడీకి కూడా పూర్తి దక్షిణ(కేరళ - తమిళనాడు) తూర్పు(ఒడిశా) - ఈశాన్యంపై ఇంకా పట్టు చిక్కలేదు. మిగతా ప్రాంతమంతా బీజేపీ పరిధిలోకి తేగలిగారు. దక్షిణ భారతంలోని ఏపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. తెలంగాణలో మోడీ అనుకూల కేసీఆరే ఉన్నారు.

* ఇక ఒడిశా విషయానికొస్తే వచ్చే ఎన్నికల్లో అక్కడ మోడీ నేతృత్వంలోని బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. నాలుగు టెర్ముల సుదీర్ఘ పాలన వల్ల నవీన్ పై ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందో ఏమో కానీ మొన్నటి లోకల్ బాడీ ఎలక్షన్లలో నవీన్ దూకుడు తగ్గింది.. సేమ్ టైం బీజేపీ తన పట్టు పెంచుకుంది.

* కేరళలో బీజేపీ మొన్నటి ఎన్నికల్లో తొలిసారి బోణీ చేసింది.

* తమిళనాడులో జయ మృతి తరువాత అక్కడ రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. ఎవరైనా పాపులర్ ఫేస్ ను ముందుపెట్టి ఆ రాష్ట్రంలో పాగా వేయాలన్నది మోడీ ప్లాన్.

* కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశాలున్నాయి.

* ఇక ఈశాన్యాన చూసుకుంటే ఇప్పటికే అస్సాంను కొట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లో టెక్నికల్ గా కాకున్నా బీజేపీ ప్రభుత్వమే ఉంది. మణిపూర్ లో గవర్నమెంటును ఏర్పాటు చేయనున్నారు.

* నాగాలాండ్ లో నాలుగు సీట్లున్నా అక్కడి ప్రభుత్వంలో బీజేపీ ఉంది.

* సిక్కింలో బీజేపీకి ఒక్క సీటూ లేకున్నా అక్కడి సీఎం ఎన్డీయేలో పార్టుగా ఉన్నారు.

* కాశ్మీర్లో బీజేపీ మిత్రపక్షం పీడీపీ ప్రభుత్వం ఉంది.

* ఎటొచ్చీ మోడీకి సవాల్ నాలుగు రాష్ట్రాలే. పంజాబ్ తాజాగా కాంగ్రెస్ పరమైంది. బీహార్లోనూ బీజేపీ పప్పులు ఉడకలేదు. గుజారత్ లో బీజేపీ పరిస్థితి కష్టంగా ఉంది. బెంగాల్ లో మమతను బీట్ అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు.

* ఈ నాలుగు మిషన్లు పూర్తయితే మోడీ మొత్తం భారత దేశాన్ని బీజేపీకి అప్పగించిన నేతగా చరిత్ర సృష్టించగలుగుతారు.

...అయితే.. మోడీ అలాంటి రికార్డు సృష్టించాలంటే అందుకు కొన్ని మార్పులు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యం... లౌకికత్వం.. సామ్యవాదం.. అన్నిటికీ ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ఈ మూడు అంశాల్లో మోడీ ఆదర్శంగా నిలవగలిగితే ఆయన పదవీకాలంలో ఒకే సమయంలో అన్ని రాష్ట్రాలూ బీజేపీ పాలనలోకి రాకపోయినా కూడా చంద్రగుప్త మౌర్యుడు, అశోక చక్రవర్తుల స్థానంలో భారతావనిని ఏక ఛత్రం కిందకు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మోడీ చక్రవర్తిగా చరిత్రకెక్కుతారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/