Begin typing your search above and press return to search.

ఈ ఐదు రాష్ట్రాలు ఒక్క‌తాటిపైకి!..మోదీకి చుక్క‌లే!

By:  Tupaki Desk   |   24 March 2018 10:35 AM GMT
ఈ ఐదు రాష్ట్రాలు ఒక్క‌తాటిపైకి!..మోదీకి చుక్క‌లే!
X
ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఆది నుంచి కేంద్రంలోని ప్ర‌భుత్వాలు చిన్న‌చూపు చూస్తూనే ఉన్నాయి. ఇందుకు నాలుగేళ్ల క్రితం ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు అతీత‌మేమీ కాదు. వాస్త‌వానికి గ‌తంలోని కేంద్ర ప్ర‌భుత్వాల కంటే కూడా మోదీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాతే... ఉత్త‌రాది - ద‌క్షిణాది అన్న భావ‌న మ‌రింత‌గా పెరిగింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... గ‌త ప్ర‌భుత్వాల కంటే కూడా మోదీ ప్ర‌భుత్వమే ద‌క్షిణాదిపై ఎక్కువ‌గా వివ‌క్ష చూపుతున్న‌ద‌న్న మాట‌. ఈ త‌ర‌హా కేంద్రం పాల‌న‌పై ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ తంబీలు ఆది నుంచి కూడా త‌మ‌దైన శైలిలో పోరు సాగిస్తున్నార‌ని చెప్పాలి. కేంద్రంపై ప్ర‌త్య‌క్షంగా పోరు సాగించ‌కున్నా త‌మ గ‌డ్డ‌పై జాతీయ పార్టీల‌కు ఏమాత్రం చోటు ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న తంబీలు నిజంగానే కేంద్ర ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌త్యేకించి కాంగ్రెస్‌ - బీజేపీ వంటి జాతీయ పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ రాష్ట్ర దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం నేప‌థ్యంలో అక్క‌డ ఏర్ప‌డ్డ రాజకీయ శూన్య‌త‌ను ఆస‌రా చేసుకుని అక్క‌డ గ‌ట్టి పునాది వేసుకుందామ‌ని భావించిన బీజేపీకి మొన్నటి ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నికల్లో తంబీలు డిపాజిట్ కూడా ఇవ్వ‌కుండా గ‌ట్టి దెబ్బే కొట్టారు.

ఇక ద‌క్షిణాదిలో క‌ర్ణాట‌క విష‌యాన్ని తీసుకుంటే.... అక్క‌డ జాతీయ పార్టీలు బీజేపీ - కాంగ్రెస్ స‌మఉజ్జీలుగానే ఉన్నాయి మొన్న‌టిదాకా బీజేపీ పాల‌న సాగిస్తే... ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాదించాల‌ని బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీని అడ్డుకునేందుకు దక్షిణాది భావ‌న‌ను మ‌రోమారు తెర‌పైకి తీసుకువ‌చ్చిన క‌ర్ణాట‌క సీఎం - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సిద్ద‌రామ‌య్య‌... మోదీపైకి అన్ని ద‌క్షిణాది రాష్ట్రాలు క‌లిసి రావాల‌ని పిలుపు ఇచ్చేశారు. ఇక తెలుగు నేల విష‌యానికి వ‌స్తే... కాంగ్రెస్ పార్టీకి ఇక్క‌డ ఘ‌న చ‌రిత్రే ఉంది. అయితే బీజేపీకే ఇక్కడ బేస్ దొర‌క‌లేదు. అయితే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలుగు నేల‌లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కొడిగట్టింది. బీజేపీ బ‌ల‌ప‌డేందుకు చేసిన య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. అయితే ఏ చిన్న అవ‌కాశం చిక్కినా వ‌దులుకోకూడ‌దన్న భావ‌న‌తో ఉన్న బీజేపీ... కేంద్రంలో త‌న చేతిలో ఉన్న అధికారాన్ని పావుగా వాడుకుంటోంది. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యానికి అడ్డుపుల్ల‌లు వేస్తున్న మోదీ స‌ర్కారు... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి క‌నీసం ఇచ్చిన హామీల మేర‌కు నిధులు కేటాయించ‌కుండా స‌తాయిస్తోంది.

ఈ క్ర‌మంలో మొన్న‌టిదాకా ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా సాగిన టీడీపీ... ఇప్పుడు వైరి వ‌ర్గంగా మారిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వ్యూహంతో ఇప్పుడు ద‌క్షిణాది పోరు బాగానే తెర పైకి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాదిలో మిగిలి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేర‌ళ కూడా ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల‌ను క‌లుపుకుని కేంద్రంపై పోరు సాగించాల‌ని దాదాపుగా తీర్మానించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు అందాల్సిన ప‌న్ను వాటాల‌పై క‌నిపిస్తున్న తేడాల‌ను ఆధారం చేసుకుని కేర‌ళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇస్సాక్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై ఆయ‌న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఆయ‌న గ‌ళం విప్పారు. ఇదే అంశంపై ఏప్రిల్‌ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులకు లేఖలు రాశానని - అందరూ సమావేశానికి వస్తామని ఫోన్లో చెప్పారని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

రాష్ట్రాలకు నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలకు బదులు 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని పదిహేనో ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహంతో ఉన్నాయి. జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు శాపంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో అవి తమ అభ్యంతరాలను గట్టిగానే చెప్పాయి. *కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేయడమే మా పాపమా?’’ అని థామస్‌ ఇస్సాక్ ఆ స‌మావేశాల్లో ప్ర‌శ్నించిన తీరు... ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం ఏ మేర అన్యాయం చేస్తుంద‌న్న విష‌యంపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింద‌నే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సును గట్టిగా వ్యతిరేకించాలని ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్దరామయ్య ట్వీట్ చేయ‌గా... సిద్దరామయ్య ట్వీట్‌ వెలువడిన గంటల్లోనే కేరళ నుంచి సంఘీభావ ప్రకటన వచ్చేసింది. మొత్తంగా మోదీ నిరంకుశ నిర్ణ‌యాల కార‌ణంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ ఇప్పుడు ఒక్క‌తాటిపైకి రాగా... మోదీ స‌ర్కారుకు భ‌విష్య‌త్తులో ప‌ట్టప‌గ‌లే చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.