Begin typing your search above and press return to search.

రొమ్ములు కోసి విప్లవాన్ని రగిల్చిన ధీరవనిత

By:  Tupaki Desk   |   16 Aug 2020 12:30 AM GMT
రొమ్ములు కోసి విప్లవాన్ని రగిల్చిన ధీరవనిత
X
రాజుల కాలం అదీ.. అగ్రవర్ణాల మహిళలే రొమ్ములను వస్త్రాలతో కప్పుకోవాలి. ఇక అల్ప, పేద, బడుగు బలహీన వర్గాల మహిళలంతా రొమ్ములు కనపడేలా పైన టాప్ ఏం లేకుండా ఆ రాజ్యంలో తిరగాలి. ‘రాజన్న’ సినిమాలో నిజాం రొమ్ములపై పన్నులు వేసినట్టే ఈ కేరళ రాజ్యంలోనూ రొమ్ము సైజును బట్టి పన్నులు కట్టాలి. ఈ దురాచారాన్ని అరికట్టడానికి ఓ మహిళ విప్లవాన్ని రగిల్చింది.. ఆ ధీరవనిత పోరాటగాథను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం.

కేరళలో స్వాతంత్ర్యానికి పూర్వం కథ ఇదీ. ట్రావెన్ కోర్ రాజుల పాలనలో మహిళల విషయంలో అమానుషంగా ప్రవర్తించేవారు. పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసం ఉండేలా నిమ్మకులాలు, గిరిజన మహిళలపై ‘రొమ్ము పరిమాణ పన్ను’ విధించారు. ఇదో దారుణమైన పన్ను విధానం.మహిళల రొమ్ము పరిమాణాలను బట్టి పన్ను విధించేవారు ట్రావెన్ కోర్ రాజులు, పాలకులు. మహిళ రొమ్ము ఎంత పెద్దగా ఉంటే అంత పన్ను ఎక్కువగా చెల్లించాలి. మహిళలు రొమ్ములు కనిపించేలా దేశంలో తిరగాలి. అధికారులకు వాటిని చూపించాలి.

ఇలా పైన వస్త్రాలు లేకుండా మహిళలు తిరిగితే అధికారులు, సైనికులు ఆ మహిళపై అత్యాచారాలకు పాల్పడేవారు. పన్నులు కట్టని వారిని భర్తల ముందే రేప్ చేసేవారు.మహిళలకు నరకం చూపించేవారు. పెద్ద రొమ్ములు ఉండే మహిళల పరిస్థితి ఆ దేశంలో దారుణంగా ఉండేది. పన్నులతోపాటు అత్యాచారాలకు గురయ్యేవారు.

ఇక వీరిని భర్తలు వదిలేయడమో.. అవమానాలతో చనిపోవడమో చేసేవారు. అయితే ఈ దుర్మార్గాలను ఎదురించింది ఓ ధీరవనిత. ఆమే ‘నంగేలి’. రొమ్ములపై పన్నులు వేయడాన్ని ఆమె అధికారులను నిలదీసింది. అగ్రకులాల స్త్రీల వలే ఆమె కూడా రొమ్ములు కనిపించకుండా వస్త్రాలు ధరించి ప్రజల్లో స్ఫూర్తి నింపింది. ఆమె భర్త కూడా మద్దతు తెలుపడంతో పన్ను విధానాన్ని నిరసిస్తూ ప్రజల్లో ఉద్యమించింది.

నంగేలి స్ఫూర్తితో ఇతర మహిళలు కూడా వస్త్రాలు ధరించి వీధుల్లోకి రావడం మొదలుపెట్టారు. ఇదో ఉద్యమంగా అయ్యేసరికి ట్రావెన్ కోర్ రాజులు, అధికారులు తట్టుకోలేక భారీ సైన్యంతో ఓరోజు ‘నంగేలి’ ఇంటిని ముట్టడించారు. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రజల్లో పోరాటాన్ని చంపాలని చూశారు.

అమెను అత్యాచారం చేసేందుకు అధికారులు సిద్దమవ్వగా.. ఎదురించి ఏకంగా పదునైన కొడవలితో తన రొమ్ములను కోసి అరిటాకుల్లో పెట్టి అధికారుల వద్దకు వచ్చింది. ఈ రొమ్మును పన్నుగా తీసుకోండి అంటూ అధికారుల ముఖం మీద విసిరింది.దీంతో అధికారులు, సైనికులు ఈ భయోత్పానికి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో నంగేలి అక్కడికక్కడే మరణించింది.

ఇక భార్య నంగేలి మరణం తట్టుకోలేక భర్త కూడా ఆమె చితిలోనే పడి చనిపోయాడు. ఆ తర్వాత నంగేలి స్ఫూర్తితో ప్రజలు తిరుగుబాటు చేసి ఆగ్రహంతో పాలకులు, అధికారులపై పోరాడి ఈ దురాచారాన్ని అరికట్టారు. ఈ అమానుష చట్టాల నుంచి విముక్తి పొందారు.

ఇప్పటికీ నంగేలి త్యాగం కేరళలో సమసమాజ స్థాపనకు నాంది పలికింది. ఆమె త్యాగం, ధైర్యాన్ని అక్కడ ప్రజలు స్వాతంత్ర్య దినం సందర్భంగా గుర్తు చేసుకుంటారు.