Begin typing your search above and press return to search.

తథాస్తు దేవత విందేమో..కోట్లు వస్తాయ్ అనగానే వచ్చేశాయ్!

By:  Tupaki Desk   |   22 Sept 2020 8:00 AM IST
తథాస్తు దేవత విందేమో..కోట్లు వస్తాయ్ అనగానే వచ్చేశాయ్!
X
ఒక్కోసారి మనం ఏం చెబితే అది అనుకోకుండా జరుగుతుంటుంది. అలా చిన్న చిన్న విషయాలు జరిగితేనే ఆశ్చర్య పోతుంటాం. మరి రూ. కోట్లు వచ్చి పడతాయ్ అంటే.. నిజంగానే వస్తే అంతకంటే మరో వింత మరొకటి వుంటుందా.. కేరళ కు చెందిన ఓ యువకుడి జీవితంలో ఇది నిజమైంది. సాయంత్రానికల్లా నేను లాటరీ కొట్టి కోటీశ్వరుడిని అవుతా.. అని స్నేహితులతో, ఇంట్లో వాళ్ళతో సరదాగా అనగా.. అందరూ జోక్ చేస్తున్నావా అంటూ పగలబడి నవ్వేశారు. కానీ నిజంగానే అతడి ఇంటికి రూ. కోట్లు వచ్చి పడ్డాయి. ఇక ఆ ఇంట్లో వాళ్లకు ఆనందానికి, ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇడుక్కి సమీప తోవాలకు చెందిన అనంతు విజయన్ అనే యువకుడు ఎర్నాకులం కడవంద్ర లోని పొన్నెత్ ఆలయంలో పని చేస్తున్నాడు. ఇతడి తండ్రి పెయింటర్. అక్క లాక్ డౌన్ తో ఉద్యోగం పోగొట్టుకుంది. తమ్ముడు చదువుకుంటున్నాడు. ఇక కుటుంబ భారం అంతా విజయన్ పైనే పడింది. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్న విజయన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

ఆదివారం అతడు తన స్నేహితులతో, ఈ రోజు సాయంత్రానికల్లా లాటరీలో రూ.12 కోట్లు గెలిచి ప్రైజ్ మనీ ఇంటికి తెస్తానని సరదాగా అన్నాడు. దీనిపై స్నేహితుల పగలబడి నవ్వారు. అయితే విజయన్ అన్న మాటలే కొన్ని గంటల్లో నిజమై అద్భుతం జరిగింది. విజయన్ లాటరీలో గెలుపొందాడు. లాటరీ రిజల్ట్ ప్రకటించగానే విజయన్ తన వద్ద ఉన్న టికెట్ నెంబర్ ప్రైజ్ మనీ వచ్చిన టికెట్ ను సరిపోల్చు కోగా అది ఒకటేనని తేలింది. తాను లాటరీలో గెలుపొందానని తెలియగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. చాలాసేపటి వరకు అది నిజమా.. కాదా.. అని నమ్మలేకపోయాడు. ఎందుకంటే అతడు గెలిచిన మొత్తం వేలో లక్షలో కాదు.. అక్షరాలా టాక్స్ మినహాయింపు పోగా 7.57 కోట్లు. విషయం తెలిసి నప్పటి నుంచి ఆనందాన్ని తట్టుకోలేకపోయా.. అసలు నిద్ర కూడా పట్టలేదు. కేవలం రెండు గంటలే నిద్ర పోయానని విజయన్ తెలిపాడు.