Begin typing your search above and press return to search.

కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని

By:  Tupaki Desk   |   20 July 2022 3:48 PM GMT
కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని
X
ఇది బెజవాడ వేదికగా సాగుతున్న గమ్మత్తైన రాజకీయం. విజయవాడ అంటేనే రాజకీయ రాజధాని. అలాంటి చోట ఒక ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజకీయం పుడితే అది ఎలా ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఇపుడు సాగుతున్న బ్రదర్స్ మధ్య వార్ ని చూస్తే అర్ధమవుతుంది. విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచి టీడీపీకి గుండెకాయ లాంటి విజయవాడలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా కేశినేని నాని ఉన్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ కూడా నానికి ఎంతో విలువ గౌరవం ఇస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలో మొత్తం అంతా జగన్ వేవ్ లో కొట్టుకుపోతే గెలిచింది మూడంటే మూడు ఎంపీ సీట్లు. ఈ సీట్లలో ఒకటి విజయవాడ లోక్ సభ. అలా టీడీపీ పరువు నిలబెట్టి తన ఇమేజ్ ని కూడా పెంచుకున్నారు కేశినేని నాని. విజయవాడలో నానికి పార్టీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి.

ఏణ్ణర్ధం క్రితం జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ గా కేశినేని నాని కుమార్తె శ్వేత పోటీ చేశారు. నాడు కచ్చితంగా విజయవాడలో టీడీపీ గెలుస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ శ్వేత అనూహ్యంగా ఓడిపోయింది. దానికంటే ముందు బెజవాడ టీడీపీ పాలిటిక్స్ లో వర్గపోరు అధికంగా ఉండడమే అని చెప్పాలి.

విజయవాడ రాజకీయాల్లఒ బోండా ఉమ, బుద్ధా వెంకన్న నాగులు మీరా వంటి వారు వేరే వర్గంగా ఉంటూ నానికి బ్రేకులు వేస్తున్నారు. వారి వల్లనే తన కుమార్తె ఓటమి పాలు అయిందని టీడీపీ అధినాయకత్వానికి నాని చెప్పడం జరిగింది. అయితే వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ తనను పక్కన పెడుతున్నారు అని నాని భావిస్తూ వచ్చారు. అది అంతకంతకు అసంతృప్తిగా మారి ఆయన టీడీపీ ఆఫీస్ కి వెళ్లడం మానుకున్నారు అని చెబుతారు.

చిత్రమేంటి అంటే టీడీపీ ప్రాణప్రదంగా నిర్వహించిన ఒంగోలు మహానాడుకు నాని హాజరుకాలేదు, ఆయన ఢిల్లీలో ఉండిపోయారు. అయితే అదే మహానాడులో నాని సొంత తమ్ముడు కేశినేని చిన్ని హడావుడి చేశారు. ఇక ఈ చిన్ని కధ ఏంటి అంటే ఆయన అన్నతో పాటే టీడీపీలో ఉంటున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆయన హైదరాబాద్ లోనే తన మకాం తన వ్యాపకాలు అన్నీ అక్కడే చూసుకుంటూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో రాజకీయల పట్ల పెద్దగా చిన్నికి ఆసక్తి లేదని నాని వర్గీయులు అంటారు. అయితే కావాలనే టీడీపీలో పెద్దలు కొందరు చిన్నిని విజయవాడ రప్పించి నానికి పోటీగా నిలబెట్టారని నాని వర్గం అనుమానిస్తోంది. దీని మీద గతంలోనే నాని కొన్ని కామెంట్స్ చేశారు. రాజకీయం ఇంట్లోకి వంట్లోకి రాకూడదు అని. తన తమ్ముడిని తమ మీదకు ఎగదోయడంతో నాని తట్టుకోలేకపోయారు అని అంటారు.

ఇంకో వైపు చూస్తే నానికి, చిన్నికి మధ్య కూడా కొన్ని ఆస్తి వివాదాలు ఉన్నాయని అంటారు. దానికి ఇపుడు రాజకీయం కూడా తోడు అయింది. వచ్చే ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నికి టికెట్ ఇవ్వాలని తెలుగుదేశంలో భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. నాని అయితే దీని మీద గుర్రుగా ఉన్నారు. తన ఇంట్లో వారినే తన మీదకు తెచ్చి రెచ్చగొడతారా అని ఆయన మండుతున్నారు.

ఈ నేపధ్యంలో సడెన్ గా నాని తన తమ్ముడు మీదనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాడుకుంటున్నారు అని నాని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అది చిన్ని భార్య ఝాన్సీ పేరు మీద రిజిష్టర్ అయి ఉన్న కారు అని పోలీసుల విచారణలో తేలింది. ఈ సంగతి తెలిసే ఇలా చేశారని అంటున్నారు.

దీని మీద చిన్ని మీడియాతో మాట్లాడు కుటుంబాన్ని బయటకు లాగడం మంచిది కాదని అన్న మీద విమర్శలు చేశారు. దీని బట్టి చూస్తే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం ముదిరింది. ఇద్దరూ కూడా చాలా దూరం వెళ్లారు. ఇక చిన్నికి లోకేష్ మద్దతు ఉందని అంటున్నారు. ఇప్పటికే విజయవాడలో దిగిన చిన్ని తన అనుచరులతో టీడీపీ తరఫున హడావుడి చేస్తున్నారు.

ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండడంతో అర్ధబలానికి ఢోకా ఉండదని అంటున్నారు. దానికి తోడు పార్టీలోని మిగిలిన వర్గాలు నానితో పడని వారు అంతా చిన్ని వెంట తిరుగుతున్నారు. ఒక విధంగా నాని వర్సెస్ చిన్ని వివాదంగా ఇది కనిపిస్తున్నా తెలుగుదేశం పెద్దలు కూడా దీని వెనక ఉన్నారని అంటున్నరు. నాని గత మూడేళ్ళుగా అధినాయకత్వంతో అంటీ ముట్టనట్లుగా ఉండడంతోనే తమదైన మరమ్మత్తుని విజయవాడ టీడీపీకి చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక నాని అయితే మొదట ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తరువాత 2009 ఎన్నికల వేళకు ఆయన టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు సహకరించారు. 2014 నాటికి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. కేశినేని ట్రావెల్స్ ని విజయవంతగా తాతల నాటి నుంచి నడుపుతూ వస్తున్నారు. అయితే 2018 లో దాన్ని నాని ఆపేశారు. రాజకీయ వివాదాలు ముసురుకోవడంతోనే అలా చేశారు అని అంటారు.

ఇపుడు నాని అయితే రాజకీయాల మీద తనకు పూర్తిగా ఆసక్తి చచ్చిపోయిందని చెబుతున్నారు. అదే టైమ్ లో తమ్ముడు చిన్నితో విభేదాలు కొనసాగిస్తున్నారు. అధినాయకత్వం అంటే మండిపడుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఇంతకీ నాని ఏం చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా కేంద్ర మంత్రులు గడ్కరీ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న కేశినేని నాని తనదైన రాజకీయాన్ని కొనసాగిస్తారు అనే చెబుతున్నారు.

ఇక్కడ సమస్యల్లా ఒక్కటే టీడీపీలో వర్గ పోరులో తనకు హై కమాండ్ సహకరించడంలేదనే నాని అలిగారు. ఈ రోజుకీ బెజవాడ టీడీపీలో బలమైన నేతగా ఉన్న నానిని టీడీపీ అంత తేలికగా వదులుకుంటుందా అన్నది కూడా చూడాలి. తమ్ముడిని ముందు పెట్టి నానిని దారిలోకి తెచ్చుకోవడంతో హై కమాండ్ విజయం సాధిస్తుందా లేక నాని కొత్త రూట్ వెతుక్కుని టీడీపీకి షాక్ ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ఇపుడు బెజవాడలో నాని వర్సెస్ చిన్ని హాట్ టాపిక్ గా ఉంది మరి.