Begin typing your search above and press return to search.

పీవీపీకి ఇదే మైనస్.. నానికి ప్లస్!

By:  Tupaki Desk   |   3 April 2019 7:57 AM GMT
పీవీపీకి ఇదే మైనస్.. నానికి ప్లస్!
X
లోకల్ ఫ్యాక్టర్.. స్థానికత ఎప్పుడూ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. తమకు దగ్గరగా ఉండి.. తమ సమస్యలు పరిష్కరించేవారినే జనాలు గెలిపిస్తుంటారు. ఇక్కడివాడైనా ఎక్కడో సెటిల్ అయ్యి కోట్లు సంపాదించి.. కన్న ఊరుకు ఏమీ చేయలేని వారిని ఆదరించరు. అది ఎన్నో ఎన్నికల్లో స్వయంగా నిరూపితమైంది.

2009 ఎన్నికల్లో చిరంజీవికి ఈ తత్వం బోధపడింది. తను పుట్టిపెరిగిన పాలకొల్లులో పోటీచేసినా కానీ ఆయనను గెలిపించకుండా స్థానికురాలైన మహిళా ఎమ్మెల్యేనే గెలిపించారు. చిరు ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరుకు అందుబాటులో ఉండకపోవడం.. ఇక్కడ ఏమీ చేయకపోవడంతో ఆయనకు ఓటమి తప్పలేదు.

ఇప్పుడు ఇదే లోకల్ ఫ్యాక్టర్ విజయవాడ ఎంపీగా బరిలో దిగిన పీవీపీకి చుక్కలు చూపిస్తోంది. స్వయానా విజయవాడ వాసి అయినా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యి కోట్లకు పడగలెత్తిన పీవీపీ సొంత ఊరుకు చేసిందేమీ లేదని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన కామెంట్లతో ప్రచారంలో ఇరుకుపెడుతున్నాడు. సినిమాల్లో సంపాదించిందంతా హైదరాబాద్ లోనే పెట్టాడని.. ఆయన నాన్ లోకల్ అంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నాడు. దీంతో విజయవాడ ఎంపీ సీటులో వైసీపీకి ఇదే పెద్ద మైనస్ గా మారింది.

ఇక పీవీపీ 2014 ఎన్నికల్లో పోటీచేయడానికి ముందుగా టీడీపీ-జనసేన అలయన్స్ లో పవన్ ద్వారా టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించారు. అక్కడ వీలుకాకపోవడంతో ఇప్పుడు వైసీపీలో చేరి టికెట్ పొందారు. దీంతో జనసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పీవీపీని టార్గెట్ చేసి అభాసుపాలుచేస్తున్నారు. జనసేన ఫ్యాక్టర్ కూడా వైసీపీ అభ్యర్థి పీవీపీకి శాపంగా మారింది.

పైగా రాజకీయాల్లో అనుభవం లేకపోవడం.. వ్యాపారవేత్తగా విశేషంగా రాణించి.. ఆ డబ్బు, పరపతితోనే వైసీపీ సీటు సంపాదించడం కూడా పీవీపీకి జనంలో ఇమేజ్ లేకుండా చేస్తోంది. పైగా పీవీపీ గెలిచినా స్థానికంగా ఉండడని జనాలు బాగా నమ్ముతున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన పీవీపీ కేవలం ఎంపీగా గెలుపు కోసమే వైసీపీలో చేరారని.. గెలిచాక ఇక్కడికి తిరిగి చూస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే లోకల్ గా మాస్ లీడర్, జనాలకు అందుబాటులో ఉండే కేశినేని నాని వైపే మొగ్గు చూపిస్తున్నారన్న వాదన వినిపడుతోంది. కేశినేని టీడీపీ లో ఉండడం.. పైగా స్థానికుడు కావడంతో ఆయనకు కాస్త ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. చూడాలి మరి బలమైన పీవీపీ ఇన్ని ఇబ్బందుల మధ్య ఎలా నెగ్గుకు వస్తాడో..