Begin typing your search above and press return to search.

బాబుకు ట్వీట్ పంచ్ ఇచ్చిన కేశినేని!

By:  Tupaki Desk   |   9 July 2019 6:13 AM GMT
బాబుకు ట్వీట్ పంచ్ ఇచ్చిన కేశినేని!
X
ట్వీట్ అస్త్రాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను కాదు.. సొంతోళ్ల‌ను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా మారింది. పార్టీ అధినేత చంద్ర‌బాబును ఉద్దేశించిన‌ట్లుగా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

ఇటీవ‌ల కాలంలో కేశినేని నాని ట్వీట్లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. వార్తాంశాలుగా మారుతున్నాయి. లోక్ స‌భ‌లో డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ గా.. పార్టీ విప్ గా త‌న‌కిచ్చిన ప‌ద‌వుల్్ని రిజెక్ట్ చేసిన కేశినేని.. త‌న‌కు ఎంపీ ప‌ద‌వి స‌రిపోతుంద‌ని.. దానికి పూర్తి న్యాయం చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా గ‌ల్లా జ‌య‌దేవ్ ను నియ‌మించ‌టంపై అసంతృప్తితో ఉన్న నానిపై ప‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆయ‌న పార్టీ మార‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. తానుఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ మార‌నంటూ ఆయ‌న బ‌ల్ల‌గుద్ది చెబుతున్నా.. పార్టీ అధినేతను సైతం ఇరుకున ప‌డేసేలా ట్వీట్లు ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. తాజాగా చూస్తే.. తెలుగుదేశానికి ఇప్పుడు విష‌యం ఉన్న వాళ్లు కావాలి.. షో చేసే వాళ్లు కాదు అంటూ ట్వీట్ అస్త్రాన్నిసంధించారు.

తాజాగా చేసిన ట్వీట్ క‌చ్ఛితంగా బాబుకు పంచ్ ఇచ్చిన‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీలో ప్రొజెక్టు అవుతున్న‌ది.. బాబు ద‌గ్గ‌ర‌కు తీసినోళ్లంతా షో చేసే వాళ్లే కానీ.. విష‌యం ఉన్నోళ్లు ఎంత‌మాత్రం కాద‌న్న మాట వినిపిస్తోంది. బాబు చేసిన త‌ప్పుల్ని.. న‌ర్మ‌గ‌ర్భంగా కేశినేని ట్వీట్ల రూపంలో చెబుతున్నార‌న్న భావ‌నను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ట్వీట్ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న కేశినేని.. పార్టీ అధినేతకే చురుకు పుట్టేలా ట్వీట్లు చేయ‌టం ఏమిట‌న్న మాట వినిపిస్తోంది.