Begin typing your search above and press return to search.

బాబు భేటీ త‌ర్వాత నాని తీరు మార‌లేదు!

By:  Tupaki Desk   |   6 Jun 2019 6:20 AM GMT
బాబు భేటీ త‌ర్వాత నాని తీరు మార‌లేదు!
X
కోరి వ‌చ్చిన ప‌ద‌విని ఎవ‌రైనా రాజ‌కీయ నాయ‌కుడు రిజెక్ట్ చేస్తారా? అందునా కేశినేని నాని? అంటే నో చెబుతారు ఎవ‌రైనా. కానీ.. ఇప్పుడాయ‌న త‌న స్థాయికి మించిన ప‌ద‌వి అంటూ పార్ల‌మెంటరీ విప్ పోస్ట్ ను రిజెక్ట్ చేస్తున్న తీరు టీడీపీలో పెను ప్ర‌కంప‌నాల్ని సృష్టిస్తోంది.

ఓప‌క్క నాని బాబుకు గుడ్ బై చెప్పేసి.. బీజేపీతో చెట్టాప‌ట్టాలు వేసుకోనున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌లో.. బాబు పిలిచి మ‌రీ విప్ పోస్ట్ ఇస్తే వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నాని తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. విప్ ప‌ద‌వికి తాను స‌రిపోన‌ని.. జ‌స్ట్ ఎంపీగా త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని నాని చెబుతున్న మాట‌ల్లో శ్లేష అర్థం కాక త‌మ్ముళ్లు త‌ల ప‌ట్టుకున్న ప‌రిస్థితి.

విప్ ప‌ద‌విని నానికి కేటాయిస్తూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని నో చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ నేప‌థ్యంలో అధినేత‌తో స‌మావేశ‌మ‌య్యారు నాని. ఈ సంద‌ర్భంగా తాను ప‌ద‌విని ఎందుకు వ‌ద్దంటున్నాన‌న్న విష‌యాన్ని బాబుకు వివ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌ద‌వుల కోసం పోటీ ప‌డి రాయ‌బారాలు న‌డిపే తీరుకు భిన్న‌మైన సీన్ బాబుకు కొత్త అనుభ‌వంగా మారిన‌ట్లు చెబుతున్నారు.

విప్ ప‌ద‌వికి నో చెప్ప‌టంతో పాటు.. గడ‌చిన కొద్దిరోజులుగా పార్టీ మారుతున్న‌ట్లుగా సాగుతున్న ప్ర‌చారంపై వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తాను విప్ ప‌ద‌వికి అర్హుడ్ని కాద‌ని.. ప‌ద‌వి తీసుకునేది లేద‌ని బాబుకు తేల్చి చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే.. దీనిపై స్ప‌ష్ట‌త రాలేదు.

నాని అల‌క‌కు కార‌ణం త‌న స‌హ‌చ‌ర ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కు పార్టీ పొలిట్ బ్యూరో.. పార్ల‌మెంట‌రీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన విష‌యంలో కినుకు వ‌హించిన నాని.. తాజా ఎపిసోడ్ కు తెర తీసిన‌ట్లుగా చెబుతున్నారు. తాను బీజేపీలో చేర‌నున్న‌ట్లుగా ప్రచారం సాగుతున్న‌స‌మ‌యంలో త‌న‌కు పార్ల‌మెంట‌రీ విప్ జారీ చేసే అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన వైనంపై స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. బాబు స్వ‌యంగా పిలిచి మాట్లాడిన త‌ర్వాత కూడా నాని త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. చేతిలో ప‌వ‌ర్ మిస్ అయితే ఎలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో బాబుకు తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.