Begin typing your search above and press return to search.

అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న కేశినేని తాజా పోస్ట్!

By:  Tupaki Desk   |   29 Jun 2019 7:05 AM GMT
అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న కేశినేని తాజా పోస్ట్!
X
గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో స‌రికొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని. మ‌రే తెలుగుదేశం పార్టీ నేత చేయ‌ని రీతిలో సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్నారు కేశినేని. నిత్యం పొద్దుపొద్దున్నే ఒక ఫేస్ బుక్ సందేశాన్ని వినిపించి కానీ త‌న రోజును షురూ చేయ‌న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ప‌రాజ‌యం అనంత‌రం.. పార్టీ తీరుపైనా.. అధినేత వ్య‌వ‌హార‌శైలి మీద ప‌రోక్షంగా చేసిన వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నంగా మారిన కేశినేని.. సోష‌ల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పోస్ట్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో ఉండేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా ఇదే త‌ర‌హాలో త‌న వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించారు కేశినేని. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌లిసి గోదావ‌రి.. కృష్ణా జ‌లాల్ని పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవాల‌న్న నిర్ణ‌యానికి రావ‌టం.. రెండు తెలుగు రాష్ట్రాల్ని స‌స్య‌శ్యామ‌లం చేయ‌టమే త‌మ తాజా ఉమ్మ‌డి ల‌క్ష్యంగా పేర్కొన‌టం తెలిసిందే.

మొన్న‌టివ‌ర‌కూ ఉన్న గొడ‌వ‌లు పూర్తిగా పోయి.. ఇప్పుడు కొత్త బంధం షురూ కావ‌టం తెలిసిందే. రెండు ప్రాజెక్టుల‌పై కొత్త త‌ర‌హా ప్ర‌తిపాద‌న‌లు తెర మీద‌కు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లోని తుపాకుల గూడెం లేదంటే దుమ్ముగూడెం వ‌ద్ద ఇంద్రావ‌తి న‌ది గోదావ‌రిలో క‌లిసే చోట బ్యారేజీ నిర్మించాల‌ని.. అక్క‌డి నుంచి కృష్ణా న‌దిలోకి నీటిని ఎత్తిపోయాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు.

గోదావ‌రి జిలాల్ని నేరుగా శ్రీ‌శైలంలోకి కాలువ‌ల ద్వారా పంపించే ప్ర‌తిపాద‌న మ‌రొక‌టి. అక్క‌డి నుంచి హంద్రీనావా.. గాలేరు న‌గ‌రి ప్రాజెక్టుల‌కు నీటిని పంప‌టం ద్వారా రాయ‌ల‌సీమ జిల్లాల‌కు నీటిని అందించ‌నున్నారు. ఇలా కొత్త ప్రాజెక్టుల మీద రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సుదీర్ఘంగా చ‌ర్చిస్తూ.. కొత్త త‌ర‌హా రాజకీయాల‌కు తెర తీస్తున్న వేళ త‌న మ‌దిలో మెదిలిన కొత్త సందేహాల్ని బ‌య‌ట‌పెట్టారు.

రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేసీఆర్.. జ‌గ‌న్ చొర‌వ‌ను తాను అభినందిస్తున్న‌ట్లు తెలిపిన కేశినేని.. త‌న‌కొస్తున్న సందేహాన్ని తెర మీద‌కు తెచ్చారు. జ‌గ‌న్ తెలంగాణ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? లేదంటే ఏపీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్న వాటిని సాధిస్తున్నారా? అస‌లేం జ‌రుగుతుంది? అన్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. నిన్న‌టి వ‌ర‌కూ తెలుగులో పెట్టిన పోస్టుల‌కు భిన్నంగా ఈ రోజు ఇంగ్లిషులో పోస్ట్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. తాజా సందేహం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అయితే.. కేశినేని వారి అనుమానాన్ని జ‌గ‌న్ పార్టీ నేత‌లు తేల్చేస్తున్నారు. అనుమాన‌పు క‌ళ్ల‌తో చూస్తే ఇలాంటి అనుమానాలే వ‌స్తాయ‌ని.. విష‌యాల్ని సానుకూల దృష్టితో చూస్తే.. అన్ని అంశాలు పాజిటివ్ గా క‌నిపిస్తాయ‌న్న విష‌యాన్ని కేశినేని నానికి ఎవ‌రు చెబుతారు?