Begin typing your search above and press return to search.

బోడిగుండుకు.. మోకాలికి లింకు పెట్టేసిన కేశినేని!

By:  Tupaki Desk   |   27 Jun 2019 7:31 AM GMT
బోడిగుండుకు.. మోకాలికి లింకు పెట్టేసిన కేశినేని!
X
నిరాశ‌.. నిస్పృహ‌లో ఉన్న వారికి స్ఫూర్తి క‌లిగించే నేత‌లు చాలా అవ‌స‌రం. దుర‌దృష్ట‌వ‌శాత్తు తెలుగుదేశం పార్టీలో అలాంటి నేత‌లు క‌నిపించ‌రు. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పే చంద్ర‌బాబు సైతం ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఆయ‌న డ‌ల్ అయిపోతారు. దీంతో.. పార్టీకి క్యాడ‌ర్ ఉన్నా స‌మ‌ర్థ‌మైన వాద‌న వినిపించే వారు కనిపించ‌ని ప‌రిస్థితి.

ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం నేప‌థ్యంలో నోట మాట రాక.. చేష్ట‌లుడిపోయిన‌ట్లుగా ఉండిపోయిన తెలుగు త‌మ్ముళ్ల‌కు తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావ‌ట్లేదు. ఇలాంటివేళ తెలుగుదేశం పార్టీకి చిన్న ఆశాదీపంలా క‌నిపిస్తున్నారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్ గా ఉన్న ఆయ‌న‌.. మొద‌ట్లో అధినేత‌కే చుక్క‌లు చూపించారు. త‌న వ‌రుస పోస్టుల‌తో ఆయ‌నేం చేయాల‌నుకుంటున్నారు? ఆయ‌న ల‌క్ష్య‌మేమిట‌న్న సందేహాలు క‌లిగిన ప‌రిస్థితి. ఏమైందో కానీ.. తాజాగా బాబుకు అండ‌గా నిలిచేలా ఆయ‌న పోస్టులు ఉంటున్నాయి. కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌కు స‌మీపంలో అక్ర‌మంగా నిర్మించారంటూ ప్ర‌భుత్వ నిర్మాణ‌మైన ప్ర‌జావేదిక‌ను కూల్చివేయాల‌న్న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

ఈ వ్య‌వ‌హారంలో త‌మ‌కు మైలేజీ వ‌స్తుంద‌ని ఫీలైన తెలుగుదేశం వ‌ర్గాల వారికి అలాంటిదేమీ రాని ప‌రిస్థితి. ఈ నిర్మాణం కూల్చివేత నేప‌థ్యంలో అక్ర‌మ నిర్మాణాల‌పై ప్ర‌భుత్వం ఇలా యాక్టివ్ గా మారాల‌న్న మాట వినిపిస్తోంది. తాము ఏదో అనుకుంటే మ‌రేదో అయ్యేలా ప్ర‌జాస్పంద‌న కూడా త‌మ‌కు అనుకూలంగా లేక‌పోవ‌టంతో త‌మ్ముళ్ల‌కు ఏం చేయాలో తోచ‌ని స్థితి.

ఇలాంటివేళ తొండి వాద‌న‌నైనా స‌మ‌ర్థంగా వినిపించ‌ట‌మే కాదు.. కొత్త ఆశ‌లు క‌లిగేలా కేశినేని నాని చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌జావేదిక కూల్చివేత‌పై లాజిక‌ల్ గా లాగి పెట్టిన ఒక్క పంచ్ ఇచ్చిన చందంగా కేశినేని ఫేస్ బుక్ వ్యాఖ్య ఉంద‌ని చెప్పాలి. ప్ర‌జావేదిక కూల్చివేత‌పై ఇప్ప‌టికే ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు ప‌లు ర‌కాలుగా స్పందించినా.. కేశినేని వారి తొండి లాజిక్ మాత్రం త‌మ్ముళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కూ ఆయ‌న చేసిన వ్యాఖ్య ఏమంటే.. ఇంకా నయం.. తాజ్ మ‌హ‌ల్.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆగ్రా లోని య‌మునా న‌దీ తీరాన ఉండ‌టంతో స‌రిపోయింది.. అదే మ‌న రాష్ట్రంలో కృష్ణా న‌దీ తీరాన ఉండి ఉంటే... అంటూ ఆపేశారు.

విన్నంత‌నే.. అవును క‌దా..? అనిపిస్తుంది. కానీ.. లోతుగా ఆలోచిస్తే.. కేశినేని వారి తొండి వాద‌న ఎంత తెలివిగా చేశారో అర్థ‌మ‌వుతుంది. ఎంకంటే.. తాజ్ మ‌హాల్ నిర్మాణ స‌మ‌యానికి జ‌ల‌వ‌న‌రుల్ని ధ్వంసం చేసేలా నిర్మాణాలు చేపట్ట‌కూడ‌ద‌న్న రూల్ లేదు. ఆ రూల్ పెట్టిన త‌ర్వాత ప్ర‌జావేదిక నిర్మించారు. అలాంట‌ప్పుడు తాజ్ మ‌హల్ వాద‌న‌లో ప‌స లేదు క‌దా.. అదో పెద్ద న‌స‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. ఏది ఏమైనా.. నిరాశ‌.. నిస్పృహ‌ల‌తో నిండిన తెలుగు త‌మ్ముళ్ల‌కు కేశినేని నాని పోస్టులు కాస్తంత ఉత్సాహాన్ని ఇచ్చాయ‌ని చెప్ప‌కత‌ప్ప‌దు.