Begin typing your search above and press return to search.

బాబు వైసీపీలో చేరితే... నాని బీజేపీకి చేరతారట!

By:  Tupaki Desk   |   5 Jun 2019 3:54 PM GMT
బాబు వైసీపీలో చేరితే... నాని బీజేపీకి చేరతారట!
X
టీడీపీ సీనియర్ నేత, బెజవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని... సెకండ్ టెర్మ్ ఎంపీగా గెలిచిన తర్వాత మొత్తం అన్ని మీడియా సంస్థలూ తనవైపు చూసేలా చేస్తున్నారు. బెజవాడ అభివృద్దిలో తనదైన ముద్ర వేసిన నాని... రాజకీయాల కోసం ఏకంగా తన లాభసాటి బిజినెస్ ఫర్మ్ కేశినేని ట్రావెల్స్ నే మూసేసుకున్నారు. అలాంటిది నాని ఇప్పుడు పార్టీ మారుతున్నారని, టీడీపీని వీడి బీజేపీలో ఆయన చేరుతున్నారని గడచిన మూడు రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల నోరు మూయించేందుకు నాని పవర్ ఫుల్ పంచ్ సంధించారు. ఒకవేళ చంద్రబాబు వైసీపీలో చేరితే... తాను బీజేపీలో చేరినట్టేనని ఆయన తనదైన శైలి అదిరేటి పంచ్ వేశారు.

సెంకడ్ టెర్మ్ ఎంపీగా గెలిచిన నాని.. ఇటీవల వ్యవహరించిన తీరుతోనే ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ బర్త్ డే నాడు పార్టీ వ్యవస్థాపకుడికి నివాళి అర్పించే పనిని పక్కనపెట్టేసిన నాని... నేరుగా నాగ్ పూర్ వెళ్లారు. అక్కడ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన నాని... విజయవాడ అభివృద్ధికి గడ్కరీ హమీ ఇచ్చారని వాటికి ట్యాగ్ లైన్లను కూడా పెట్టారు. అంతేకాకుండా తనకు ఇష్టమైన పొలిటీషియన్ గడ్కరీనేనంటూ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. దీంతో నాని బీజేపీలో చేరిపోతున్నారని వార్తలు వచ్చాయి. మొన్న విజయవాడలో చంద్రబాబు పాల్గొన్న ఇఫ్తార్ విందుకు డుమ్మా కొట్టిన నాని... తాజాగా లోక్ సభలో పార్టీ విప్ పదవిని కూడా తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో నాని పార్టీ మారడం ఖాయమేనన్న వార్తలకు మరింతగా బలం వచ్చేసింది. అయితే ఈ వార్తలను ఖండించేందుకు చాలా ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చిన నాని... తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం సత్యం లేదని తేల్చేశారు. తనను ఈ విషయంలో మరో ప్రశ్న వేయకుండా ఉండేలా... నాని పవర్ ఫుల్ పంచ్ వేశారు. ఒకవేళ చంద్రబాబునాయుడు వైసీపీలో చేరితే... తాను బీజేపీలో చేరినట్టేనని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.