Begin typing your search above and press return to search.

జగన్ ఇంగ్లీష్ మీడియంపై లోక్‌ సభలో ప్రస్తావన

By:  Tupaki Desk   |   18 Nov 2019 1:11 PM GMT
జగన్ ఇంగ్లీష్ మీడియంపై లోక్‌ సభలో ప్రస్తావన
X
కొద్దిరోజులుగా ఏపీలో పాలక - విపక్షాల మధ్య వాదోపవాదాలకు తావిచ్చిన ఇంగ్లిష్ మీడియం అమలు అంశం ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో చర్చకొచ్చింది. తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ నిర్ణయం వల్ల తెలుగు భాష వికాసానికి నష్టం కలుగుతుందని అన్నారు.

లోక్‌ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధనను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుందని.. దాని వల్ల ప్రాంతీయ భాషల పరిరక్షణకు విఘాతమేర్పడుతుందని అన్నారు. కేవలం ఇంగ్లిష్ మీడియం రుద్దకుండా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఆ సమయంలోనూ లోక్ సభ గందరగోళంగా ఉండగా.. వైసీపీ సభ్యుడు రఘురామకృష్ణంరాజు లేచి జగన్ తీసుకున్న నిర్ణయం పేద విద్యార్ధులకు మేలు చేస్తుందని చెప్పారు. ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూనే తెలుగు తప్పనిసరి చేసిన విషయాన్ని సభకు వివరించారు.

ఏపీ ప్రబుత్వం తెలుగు భాషకేమీ అన్యాయం చేయడం లేదని ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఛైర్ పర్సన్ గా తెలుగు అకాడమి.. అదే విధంగా తెలుగు అధికార భాష సంఘం ఛైర్మన్ గా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ను నియమించినట్లు చెప్పారు.

కేశినేని నాని - రఘురామకృష్ణంరాజు మాట్లాడిన తరువాత కేంద్ర మానవ వనరుల మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారు పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు.

మంత్రి ముక్తాయింపుతో లోక్ సభలో ఈ అంశంపై డిస్కషన్ దాదాపు ముగిసినట్లే అయింది. సభలో టీడీపీకి బలం కూడా లేకపోవడం.. కేవలం ముగ్గురే ఎంపీలు ఉండడంతో విషయాన్ని సభలో బలంగా వినిపించలేకపోయారు.