Begin typing your search above and press return to search.

బెజవాడ రాజకీయాల్లో మలుపు.. వంగవీటి రాధాతో కేశినేని భేటీ!

By:  Tupaki Desk   |   1 Aug 2022 1:13 PM GMT
బెజవాడ రాజకీయాల్లో మలుపు.. వంగవీటి రాధాతో కేశినేని భేటీ!
X
ఏపీ రాజకీయాలకు గుండెకాయలాంటి బెజవాడ (విజయవాడ)లో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్‌)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో భేటీ కావడంతో ఒక్కసారిగా విజయవాడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి తాను పోటీ చేయబోనని ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పారని అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. విజయవాడ టీడీపీలో చంద్రబాబుకు నమ్మిన బంట్లు, అత్యంత విశ్వసనీయులుగా ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాలతో కేశినేని నానికి విభేదాలున్నాయి.

గత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. నాని కూతురు కేశినేని శ్వేతను టీడీపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడాన్ని బుద్ధా, నాగుల్‌ మీరా వర్గాలు వ్యతిరేకించాయి. వారికే చంద్రబాబు, లోకేష్‌ అండగా నిలుస్తుండటంతో సమయం వచ్చిన ప్రతిసారీ కేశినేని నాని.. టీడీపీ అధిష్టానంపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆఫ్‌ ది రికార్డ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని తేల్చిచెప్పారు.

మరోవైపు తనకు వ్యతిరేకంగా తన సొంత తమ్ముడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తుండటాన్ని నాని జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని నానికి బదులుగా కేశినేని చిన్నికి చంద్రబాబు అవకాశమిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై నాని మండిపడుతున్నారని చెబుతున్నారు. తాను పోటీ చేయనని.. వచ్చే ఎన్నికల్లో వేరే అభ్యర్థిని చూసుకోమంటే తన సోదరుడు కేశినేని చిన్నిని పెట్టడమేంటని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తన ఎంపీ స్టిక్కరు ఉన్న కారును గుర్తు తెలియని వ్యక్తులు వాడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఎంపీ స్టిక్కరును అతికించుకుని తిరుగుతుంది.. తన తమ్ముడు కేశినేని చిన్నినే అని నానికి తెలుసు. అయినా సరే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా కేశినేని చిన్ని ఆగస్టు 1న విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ చూసుకుంటున్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో విజయవాడకు వచ్చారు. వంగవీటి రాధాతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగిందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీగా కేశినేని నాని, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ తరఫున వంగవీటి రాధా బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. దీనిపై చిన్ని, రాధాల మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు.