Begin typing your search above and press return to search.

స్వాములోళ్ల శాపాలు నానికి స్టార్ట్ అయ్యాయా?

By:  Tupaki Desk   |   5 July 2016 5:54 AM GMT
స్వాములోళ్ల శాపాలు నానికి స్టార్ట్ అయ్యాయా?
X
కృష్ణా పుష్కరాల కోసం రోడ్ల విస్తరణ.. అభివృద్ధికార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆలయాల్ని కూల్చివేసిన వైనం ఏపీ సర్కారును ఆత్మరక్షణలో పడేయటం తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత వ్యక్తం కావటమే కాదు.. మిత్రపక్షమైన బీజేపీ సైతం తీవ్రస్థాయిలో ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించింది. ఇక.. స్వాములోళ్లు అయితే.. ఏకంగా ఒక సభ పెట్టేసి ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. దేవాలయాల్లో కీలకభూమిక పోషించినట్లుగా చెబుతున్న కేశినేని నానిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు... కొందరు స్వాములైతే శాపాలు కూడా పెట్టేశారు.

ఇది జరిగిన ఒక రోజు కాక ముందే.. ఎంపీ కేశినేని నానికి సంబంధించి బస్సు ఒకటి రోడ్డు ప్రమాదానికి గురి కావటం గమనార్హం. మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా చివ్వెంల మండలం గుజలూరు సమీపంలోని నేషనల్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేటలోని ఒక చర్చిలో ప్రార్థనలు ముగించుకొని ఆటోలో వెళుతున్న వారిని.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కేశినేని బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మరో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజానికి ఈ ప్రమాదానికి కేశినేని నానికి నేరుగా సంబంధం లేకపోవొచ్చు. కానీ.. ఆలయాల కూల్చివేతలో కీలకభూమిక పోషించిన కేశినేని నానికి ఇబ్బంది కలిగించేలా ఆయన వ్యాపార సంస్థకు చెందిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్వాముల ఆగ్రహం నానిని వెంటాడుతుందా? అన్న వ్యాఖ్యల్ని పలువురు అనుకోవటం గమనార్హం.