Begin typing your search above and press return to search.

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి.. భారీ సెగ‌.. నోటి దురుసు తెచ్చిన తంటా!!

By:  Tupaki Desk   |   15 March 2021 5:30 PM GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి.. భారీ సెగ‌.. నోటి దురుసు తెచ్చిన తంటా!!
X
ఆయ‌న వైసీపీలో యువ నాయ‌కుడు. పైగా అనంత‌పురం జిల్లాలో ఆయ‌న అధికార పార్టీకి పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్‌. త‌ర‌చుగా ఆయ‌న విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతుంటారు. అప్పుడప్పుడు మాత్రం సొంత పార్టీ నేత‌ల‌పైనే కామెంట్లు చేస్తుంటారు. ఆయ‌నే ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీలో ఆయ‌న‌కు.. ఈ ఫైర్ ఇమేజే గుర్తింపు పెంచినా.. అన్ని చోట్లా కూడా ఇదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.. మాత్రం వ‌ర్క‌వుట్ అవుతుందా? మ‌రీ ముఖ్యంగా జిల్లా అధికారి.. క‌లెక్ట‌ర్‌పైనా నోరు పారేసుకుంటే.. ఏమవుతుంది? ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఎదురైంది. ఇటీవ‌ల ఆయ‌న అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌.. గంధం చంద్రుడిపై నోరు పారేసుకున్నారు.

``ఎవ‌రి ప్రాణాలు తీయ‌డానికి పుట్టాడు ఈ క‌లెక్ట‌ర్‌!!`` అని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఇది జిల్లాలో తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా క‌లెక్ట‌ర్‌పై ఎమ్మెల్యేల వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా.. రెవెన్యూ సిబ్బంది.. న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి విధుల‌కు హాజ‌ర‌య్యారు. అదేస‌మ‌యంలో ద‌ళిత సంఘాలు.. ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు. ఇప్పుడు ఇది కేతిరెడ్డికి సెగ పెడుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. మ‌హా శివ‌రాత్రి ఉత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా.. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో కాటకోటేశ్వరస్వామి ఊరేగింపును నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఈ విష‌యంలో గ్రామాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి. గ్రూపులు ఏర్ప‌డ్డాయి.

దీంతో విష‌యం తెలిసిన క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు.. ఏకంగా ఊరేగింపును నిలిపివేస్తూ.. ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆల‌య త‌లుపులు మూసివేశారు. ఇక‌, ఊరేగింపు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన గ్రామ‌స్తుల్లో ఒక వ‌ర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డికి చెందింది. క‌లెక్ట‌ర్ నిర్ణ‌యంతో ఎమ్మెల్యే వ‌ర్గం రామేశ్వరరెడ్డి, బాలిరెడ్డి మనస్తాపం చెంది, పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్ర‌స్తుతం వారు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి, పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ నిర్ణ‌యంపై ఎమ్మెల్యే విరుచుకుప‌డ్డారు.

``ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్‌ లెక్కచేయటం లేదు. మమ్మల్ని వెధవలను చూసినట్లు చూస్తున్నాడు. చివరికి మంత్రుల పట్ల కూడా అదేరీతిన వ్యవహరిస్తున్నాడు’` అని కలెక్టర్‌ గంధం చంద్రుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రుడు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఊరేగింపును అడ్డుకోవటం సిగ్గుమాలిన చర్యన్నారు. చిల్లవారిపల్లిలో కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు.అయితే.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావివర్గాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. తాజాగా రెవెన్యూ వ‌ర్గాలు .. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా.. న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌న తెలిపాయి. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.