Begin typing your search above and press return to search.

వాలంటీర్లను చెప్పుతో కొడతానంటున్న వైసీపీ ఎమ్మెల్యే...?

By:  Tupaki Desk   |   27 Sept 2022 11:00 PM IST
వాలంటీర్లను చెప్పుతో కొడతానంటున్న వైసీపీ ఎమ్మెల్యే...?
X
ఆయన వైసీపీ ఎమ్మెల్యే. యువకుడు, ఉత్సహవంతుడు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దూకుడుగా ఉంటారు. ఆయన లేటెస్ట్ గా తీవ్ర పదజాలంతో వాలంటీర్లను హెచ్చరించిన ఒక ఆడియో క్లిప్ ఇపుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియో క్లిప్ లో ఎమ్మెల్యే వాలంటీర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

కొందరు వాలంటీర్లు లబ్దిదారుల నుంచి లంచాలు కోరుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, అది కనుక నిజమైతే అలాంటి వారిని చెప్పుతో కొడతా అంటూ ఎమ్మెల్యే ఉగ్రరూపమే చూపించారు. తక్షణం ఆయా వాలంటీర్లు తాము లంచాలుగా తీసుకున్న మొత్తాలను లబ్దిదారులకు తిరిగి చెల్లించాలని కూడా ఆయన ఆదేశాలను జారీ చేయడం విశేషం.

అదే విధంగా మరో ఆడియో క్లిప్ కూడా ఆయనదే బయటకు వచ్చింది. అందులో ఆయన కౌన్సిలర్లకు వార్నింగ్ ఇచ్చారు. కొందరు కౌన్సిలర్లు సంక్షేమ పధకాల అమలు విషయంలో లంచాలు అడుగుతున్నట్లుగా తనకు సమాచారం పక్కాగా తెలిసిందని, వారు తమ ధోరణి మార్చుకోకపోతే పూర్తి ఆధారాలతో క్రిమినల్ కేసులు బుక్ చేయిస్తాను అంటూ ఎమ్మెల్యే అనడం విశేషం.

ఈ రెండు ఆడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలని కేతిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు ఆయన అవినీతిని అసలు సహించడంలేదు. అవినీతి చేస్తే ప్రజలను బాధపెడితే వారు తిరిగి మనలనే శిక్షిస్తారు అని పార్టీ వారికి చెబుతూ ఉంటారు.

అయితే ఎమ్మెల్యే ఆశయం ఉద్దేశ్యం మంచిదే అయినా కూడా ఆయన వాడుతున్న భాష పరుషంగా మొరటుగా ఉందని అంటున్న వారూ ఉన్నారు. ఉదాహరణకు వాలంటీర్లను చెప్పుతో కొడతామని ఎమ్మెల్యే అనడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల ఎమ్మెల్యే ఉద్దేశ్యం ఏదైతే ఉందో అది వెనక్కుపోతుంది అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎమ్మెల్యే తాను చెప్పాలనుకున్నది సరళమైన భాషలో చెప్పవచ్చు కదా అన్నది పార్టీ వారి మాటగా కూడా ఉంది. అయినా ఈ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే దూకుడుగానే ఉంటున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.