Begin typing your search above and press return to search.

కేతిరెడ్డి vs కలెక్టర్ : దళిత సంఘాల ఛలో ధర్మవరం .. అప్రమత్తమైన పోలీసులు

By:  Tupaki Desk   |   25 March 2021 11:30 AM GMT
కేతిరెడ్డి vs  కలెక్టర్ : దళిత సంఘాల ఛలో ధర్మవరం .. అప్రమత్తమైన పోలీసులు
X
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గంధం చంద్రుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనికిమాలిన కలెక్టర్ ను తానెప్పుడూ చూడలేదని, ఎమ్మెల్యేలను వెధవలను చూసినట్లు చూస్తున్నాడని, చివరకు మంత్రులను కూడా వెధవలను చూసినట్లు చూస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు దళితులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.

ఈ కారణంతో జిల్లా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి రామచంద్రారెడ్డి పై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో ధర్మవరానికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేతిరెడ్డి నివాసాన్ని ముట్టడించాలి అన్న దళిత సంఘాల పిలుపు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి నివాసం వైపు వెళ్లే అన్ని రహదారులపై బారికేడ్ల ను ఏర్పాటు చేసి రాకపోకలను ఆపేస్తున్నారు . దళిత సంఘాల చలో ధర్మవరం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే , స్థానిక దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తున్నారు . ఇప్పటికే కలెక్టర్ ను పరుష పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువగా మారాయి. కలెక్టర్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. చూడాలి మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో.