Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీల వద్దే కీలక శాఖలు

By:  Tupaki Desk   |   4 April 2017 7:07 AM GMT
ఎమ్మెల్సీల వద్దే కీలక శాఖలు
X
ఏపీ మంత్రివర్గంలో కీలక శాఖలు ఎవరి వద్ద ఉన్నాయో పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురికి కీలక శాఖలు దక్కాయి. అంతేకానీ.. ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికైనవారికి ఎవరికీ కీలక శాఖలు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన శాఖలను నిర్వహించే బాధ్యతలను పెద్దల సభను నుంచి ప్రాతినిధ్యం వహించినవారికే అప్పగించారు ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు.

ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ - శాసన వ్యవహారాల శాఖ మంత్రిగా సీనియర్‌ నాయకుడు - ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అనుచరుడు పొంగూరు నారాయణ నవ్యాంధ్ర ప్రదేశ్‌ లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న రాష్ట్ర పురపాలన - పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా ఎమ్మెల్సీయే. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ శాసనమండలి నుంచి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అత్యంత కీలకమైన ఐటి - పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్థానం నారా లోకేష్‌ దే కానుంది. శాసనమండలి సభ్యునిగా ఉన్న మరో సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డికి కూడా తాజా విస్తరణంలో బెర్తు ఇచ్చి ప్రాధాన్యమున్న వ్యవసాయ శాఖ ఇచ్చారు.

శాసనసభ సభ్యుల్లో మూడోవంతు సభ్యులు ఉన్న శాసనమండలికి రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు. 176 మంది సభ్యులున్న శాసనసభ నుంచి ముఖ్యమంత్రితోపాటు, మరో 21 మంత్రి పదవులు దక్కగా - 58 మంది సభ్యులున్న శాసనమండలిలో నలుగురికే మంత్రి పదవులు వచ్చాయి. సంఖ్యపరంగా నిష్పత్తి తగ్గినా ప్రాధాన్యంపరంగా మండలి సభ్యుల వద్దే ప్రధాన శాఖలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/