Begin typing your search above and press return to search.

పట్టు వ‌ద‌ల‌ని అమ‌రావ‌తి రైతులు.. ఈసారి యాత్ర ఇలా!

By:  Tupaki Desk   |   13 Aug 2022 4:28 AM GMT
పట్టు వ‌ద‌ల‌ని అమ‌రావ‌తి రైతులు.. ఈసారి యాత్ర ఇలా!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని కోరుతూ అమ‌రావ‌తి ప్రాంత రాజ‌ధాని రైతులు 970 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, ఉద్య‌మాలు కొన‌సాగిస్తున్న తెలిసిందే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాలంటూ.. ఇప్ప‌టికే న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు అంటూ అమ‌రావ‌తి రైతులు హైకోర్టు నుంచి తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు.

ఈ యాత్ర‌కు ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూడా మ‌ద్ద‌తివ్వ‌డంతోపాటు ఆ యాత్ర‌లో కూడా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉలుకుప‌లుకు లేక‌పోవ‌డంతో మ‌రోమారు భారీ పాద‌యాత్ర‌కు అమ‌రావ‌తి రైతులు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు.

ఈసారి అసెంబ్లీ నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు భారీ పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌లంలో ఉన్న శాస‌న‌స‌భ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్ర‌ముఖ సూర్య దేవాల‌యం అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు భారీ పాద‌యాత్ర చేప‌ట్టి త‌మ నిర‌స‌న‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఉన్నారు.ఇందుకు సెప్టెంబర్ 12ను ముహూర్తంగా నిర్ణ‌యించుకున్నారు. సెప్టెంబ‌ర్ 12 నాటికి అమరావతి రైతుల ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తవుతుంది.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేసిన‌ మందడంలో యజ్ఞం చేసి రైతులు త‌మ పాదయాత్రను ప్రారంభించ‌నున్నారు. అసెంబ్లీ నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు జ‌రిగే పాద‌యాత్ర‌ సుమారు 60 రోజులు.. అంటే రెండు నెల‌లు కొన‌సాగుతుంద‌ని స‌మాచారం. ఇంత‌కు ముందు చేప‌ట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర‌ను 44 రోజుల‌పాటు రైతులు చేశారు.

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర‌ను తిరుప‌తిలోని అలిపిరి వ‌ర‌కు నిర్వ‌హించి అక్క‌డ గ‌రుడ విగ్ర‌హానికి, వేంక‌టేశ్వ‌ర‌స్వామికి రైతులు కొబ్బరికాయ‌లు కొట్టారు. ఈసారి అసెంబ్లీ నుంచి మొద‌ల‌య్యే పాద‌యాత్ర ద్వారా అర‌స‌వ‌ల్లిలోని సూర్య దేవాల‌యానికి చేరుకుని రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని సూర్య భ‌గ‌వానుడిని వేడుకోనున్నారు.

కాగా న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా జ‌గ‌న్ స‌ర్కార్ అనేక అడ్డంకులు, ఆంక్ష‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించి అనుమ‌తి తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌ళ్లీ ఈసారి రైతులు మ‌రో భారీ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.