Begin typing your search above and press return to search.

పొత్తులపైన కీలక నిర్ణయం అపుడేనట... ?

By:  Tupaki Desk   |   11 Jan 2022 9:30 AM GMT
పొత్తులపైన కీలక నిర్ణయం అపుడేనట... ?
X
ఏపీలో రాజకీయం బాగా హీటెక్కుతోంది. పొత్తులు ఎత్తుల మధ్య పార్టీల వార్ సాగుతోంది. టీడీపీ జగన్ కి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడగట్టుకోవాలని చూస్తోంది. ఏ ఒక్క పార్టీని విడిచిపెట్టకుండా అన్నింటినీ ఒక చోటకు చేరి జగన్ మీద మహా యుద్ధానే ప్రకటించాలని భావిస్తోంది. ఈ ప్రయత్నంలో అగ్ర తాంబూలం ఇచ్చేది కచ్చితంగా జనసేనకే. ఆ పార్టీకి ఏపీలో మిగిలిన పార్టీల కన్నా అధికాంగా ఓటు బ్యాంక్ ఉంది. పైగా చరిష్మాటిక్ లీడర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో ఆయన్ని ముందు తమ వైపునకు తిప్పుకుంటే మిగిలిన పని సులువు అవుతుంది అన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్.

అందుకే కొత్త ఏడాది వస్తూనే కుప్పం కేంద్రంగా బాబు చాలా జాగ్రత్తగా బంతిని తెచ్చి పవన్ కోర్టులోకి నెట్టేశారు. వన్ సైడ్ లవ్ కుదరదు అవతల వారు కూడా ఇష్టపడాలి కదా అంటూ బాబు తమ్ముళ్ళకు చెప్పినా ఇండైరెక్ట్ గా పవన్ కే చెప్పినట్లుగా అనుకుంటున్నారు. పవన్ ఈ విషయంలో ఏం చేస్తారు, ఏం మాట్లాడుతారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజనికి ఈ నెల‌ 9న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పొత్తుల మీద ఆయన మాట్లాడుతారు అని టీడీపీ సహా అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిని చూపాయి.

అయితే కరోనా మూడవ దశ ఉధృతి నేపధ్యంలో ఆ మీటింగును పవన్ సడెన్ గా వాయిదా వేసుకున్నారు. దాంతో పవన్ పొత్తుల మ్యాటర్ మీద ఎపుడు రియాక్ట్ అవుతారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది. అయితే దీనికి సరైన వేదిక ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యాయని అంటున్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14న ప్రతీ ఏటా నిర్వహిస్తారు. ఆ కీలక‌ సమావేశంలో పార్టీకి సంబంధించి ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు.

సార్వత్రిక ఎన్నికలు అప్పటికి కచ్చితంగా రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ మీటింగులో పవన్ జనసేన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారని జనసేన‌తో పాటు టీడీపీ కూడా ఎదురుచూస్తోందని టాక్. ఆ మీటింగులో పవన్ 2024లో పొత్తుల అంశం మీద పూర్తి క్లారిటీతో కాకపోయినా కొన్ని సంకేతాలు అయినా ఇస్తారు అని అంతా భావిస్తున్నారు.

ఇక పవన్ వైఖరి చూస్తే ఆయన వైసీపీ గద్దె దిగిపోవాలి జగన్ మాజీ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు అని అర్ధమవుతోంది. ఈ విషయంలో టీడీపీతో కచ్చితమైన భావసారూప్యం ఉంది. మొదటి పాయింట్ వరకూ ఓకే అయినా మళ్లీ టీడీపీకి మద్దతు ఇచ్చి చంద్రబాబునే సీఎం గా చేస్తారా. జనసేన కేవలం పల్లకీని మోసే బోయీనా అన్న చర్చ అయితే ఆ పార్టీ నుంచే వస్తోంది. అందువల్ల దాని మీద ఆచీ తూచీ స్పందిస్తారు అని అంటున్నారు.

మరో వైపు బీజేపీని కూడా వదులుకోవడానికి పవన్ సిద్ధంగా లేరు అంటున్నారు. వీలైతే టీడీపీ బీజేపీలను రెండింటినీ కలుపుకుని 2014 మాదిరిగా కూటమి కట్టడానికే ఆయన ఇష్టపడతారు అని అంటున్నారు. అలా వీలు అయ్యేలా చివరి దాకా చూస్తారనే చెబుతున్నారు. అందువల్లనే చంద్రబాబు వన్ సైడ్ లవ్ ట్రాక్ కి అంత ఈజీగా పవన్ రియాక్షన్ ఇవ్వలేరు అంటున్నారు.

అయితే పవన్ రాజకీయ పోకడలను బట్టి చూస్తే ఆయన కచ్చితంగా జగన్ సీఎం గా ఉండకూడదు అని కోరుకునే వారిలో ఫస్ట్ ఉంటారు. చంద్రబాబు కూడా డిటోనే. అయితే బీజేపీ తీరు చూస్తే చంద్రబాబు లేని కూటమిని కోరుకుంటోంది. మళ్లీ బాబుతో పొత్తు అంటే అరకొర సీట్లు దక్కుతాయి తప్ప అధికారం అన్నది ఎప్పటికీ అందని పండే అవుతుంది అన్న ఆలోచన కమలదళానిది. అందుకే పవన్ తో జట్టు కట్టి 2024 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి విపక్షంలో తన ప్లేస్ ని గట్టి పరచుకుంటే 2029 నాటికైనా అధికారంలోకి రావచ్చు అన్నది బీజేపీ యోచన.

మరి పవన్ అయితే 2024 నాటికే జగన్ దిగిపోవాలని చూస్తున్నారు. ఈ రకమైన ఆలోచనల్లో తేడా వల్లనే బీజేపీతో పవన్ కొనసాగుతారా. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి కొత్త స్నేహాన్ని కలుపుతారా అన్నది చర్చ. చూడాలి మరి మార్చి 14న దీనికి సంబంధించి ఎంతో కొంత క్లారిటీ అయితే రావచ్చు అని ఇరు పార్టీల నేతలు ఆశిస్తున్నారు.