Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల నీటి లొల్లిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   17 July 2021 4:21 AM GMT
తెలుగు రాష్ట్రాల నీటి లొల్లిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో ఏముంది?
X
కూర్చొని మాట్లాడుకుంటే తేలే అంశాల మీద.. పంతాలు.. పట్టింపులకు పోవటం ద్వారా కేంద్రానికి నిర్ణయాన్ని తీసుకోక తప్పనిసరి పరిస్థితి తీసుకురావటం తెలిసిందే. ఏళ్లుగా నలుగుతున్న జల వివాదాలకు చెక్ చెబుతూ.. తాజాగా కేంద్రం కీలక గెజిట్ ను జారీ చేసింది. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తనదైన పరిష్కారం చూపించేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం కారణంగా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ లోని రెండు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది అక్టోబరు 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి.

దీంతో.. కృష్ణా పరివాహక ప్రాంతంలోని 36 ప్రాజెక్టులు.. గోదావరి బేసిన్ లోని 71 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి రానున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం.. నాగార్జునసాగర్ సహా చిన్న.. మధ్యతరహా.. భారీ ప్రాజెక్టులు.. వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు.. సరఫరా వ్యవస్థ.. ఆయుకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు.. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతల్ని బోర్డులే నిర్వహిస్తాయి.

బేసిన పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించే అధికారం బోర్డులకే ఉంటుంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ లో పూర్తి వివరాల్ని పేర్కొన్నారు. ఇంతకీ గెజిట్ లో ఏముంది? అందులోని ముఖ్యాంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే..

- విభజన చట్టం సెక్షన్‌–85(1) ప్రకారం నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ (28-05-2014) జారీ చేసింది. ఈ బోర్డులు అపెక్స్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణలో పని చేస్తాయి.

- కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందని వారినే నియమించాలి. రెండు రాష్ట్రాలకు చెందని వారినే బోర్డు సభ్య కార్యదర్శులుగా, చీఫ్‌ ఇంజనీర్లుగా నియమించాలి.

- కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ బోర్డులకే ఉంటుంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించిన రోజు నుంచి 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వరూపం, వాటిలో పని చేసేందుకు ఆయా విభాగాల ఉద్యోగులను కేంద్రం నియమించాలి.

- విభజన చట్టం సెక్షన్‌–87(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని షెడ్యూల్‌–1, షెడ్యూల్‌–2, షెడ్యూల్‌–3లో పేర్కొన్న ప్రకారం పూర్తయిన, నిర్మాణంలో ఉన్నవి బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అంటే.. ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువల వ్యవస్థలో విభాగాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ బోర్డు పరిధిలోకి వస్తాయి.

- గత ఏడాది అక్టోబరు ఆరున జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేసిన అంశాలకు తగ్గట్లు రాష్ట్రాలు నడుచుకోవాలి.

- సదరు ప్రాజెక్టుల పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో సహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాలి. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది.

- బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్‌–1 ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టు.. హైకోర్టు.. ట్రిబ్యునళ్లలో ఏమైనా కేసులు విచారణలో ఉంటే వాటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అంతేకాదు.. ఫ్యూచర్ లో ఏమైనా కేసులు దాఖలైనా అందుకు బాధ్యత తీసుకోవాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తప్పించి.. బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి వర్తిస్తుంది.

- షెడ్యూల్‌–3 ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు చేపట్టాలి. బోర్డులు పర్యవేక్షిస్తుంటాయి.