Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం ?

By:  Tupaki Desk   |   14 July 2022 5:33 AM GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం ?
X
గడచిన నాలుగున్నర నెలలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ? తుర్కియే (టర్కీ) కీలక నగరమైన ఇస్తాంబుల్ కేంద్రంగా మొదలైన పరిణామాలు దీన్నే సూచిస్తున్నాయి. ఉక్రెయిన్ నుండి ప్రపంచదేశాలకు నిత్యావసరాల ఎగుమతిని అనుమతించే విషయమై రష్యా-ఉక్రెయిన్ సైనిక ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. ఇలాంటి సమావేశాలు గతంలో కూడా జరిగినా పెద్దగా పురోగతి కనిపించలేదు.

అయితే తాజా చర్చల్లో ఈ రెండు దేశాల సైనిక ప్రతినిదులే కాకుండా తుర్కియే ప్రతినిధులు+ఐక్యరాజ్యసమితి తరపున కూడా కొందరు ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకవైపు యుద్ధం జరుగుతున్నా మరోవైపు ఈ సమావేశం జరపాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల చాలా దేశాల్లో నిత్యావసరాలకు బాగా ఇబ్బందులు మొదలయ్యాయి. వంటనూనెలు, బొగ్గు, గోధుమల ఎగుమతుల్లో ఉక్రెయిన్ అతిపెద్ద దేశాల్లో ఒకటి.

యుద్ధం కారణంగా పై మూడు ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పై నిత్యావసరాలపై ఆధారపడిన చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒక అంచనా ప్రచారం ఉక్రెయిన్ గోదాముల్లో 2.20 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోయాయి.

ఇవన్నీ చేరాల్సిన దేశాలకు చేరితే ఆయా దేశాల్లో వాటి ధరలు తగ్గటమే కాకుండా జనాలకు అందుతాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ నుండి విదేశాలకు ఓడల రవాణాకు ముఖ్యమైనది నల్ల సముద్రంలోని పోర్టులు.

ఈ పోర్టులన్నింటినీ రష్యా తన ఆధీనంలోకి తీసుకున్నది. యుద్ధం మొదలవ్వటానికి ముందే ఇతర దేశాల ఓడలు నిత్యావసరాలను తీసుకుని బయలుదేరాయి. నల్ల సముద్రం గుండా ప్రయాణిస్తున్న సుమారు 80 నౌకలను రష్యా ఎక్కడివాటిని అక్కడే ఆపేసింది. దాంతో ఆ నౌకలోని సరఫరా అవుతున్న నిత్యావసరాలు కూడా ఆగిపోయాయి. ఇదే సమయంలో మల్లసముద్రం గుండా ప్రయాణించాల్సిన తమ నౌకలను ఆయా దేశాలు నిలిపేశాయి.

దాంతో యావత్ ప్రపంచంలో నిత్యావసరాలకు కొరత మొదలైపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా-ఉక్రెయిన్ దేశాల సైనిక ప్రతినిధులతో తుర్కియేలో చర్చలకు వేదికను రెడీచేసింది. చర్చలు దాదాపు ఫలించినట్లే అంటున్నారు. కాబట్టి ఎగుమతులు మొదలైతే కీలక పరిణామమనే చెప్పాలి.