Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి దూకుడు.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌లు!

By:  Tupaki Desk   |   18 July 2021 5:12 PM GMT
రేవంత్ రెడ్డి దూకుడు.. కాంగ్రెస్ లోకి కీల‌క నేత‌లు!
X
రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా అధిష్టానం నియమించ‌డానికి ప్ర‌ధాన అర్హ‌త కేవ‌లం ఫైర్ బ్రాండ్ అనే స్పెషాలిటీ మాత్ర‌మే అనుకున్నారు అంద‌రూ. కేసీఆర్ ను మాట‌కు మాట అంటూ ధీటుగా ఎదుర్కొనే నేత‌గానే ఇన్నాళ్లూ పేరుంది రేవంత్ కు. కానీ.. తాను అంద‌రినీ స‌మ‌న్వ‌య ప‌రిచే అస‌లైన రాజ‌కీయ‌వేత్త‌ను అని చాటుకుంటున్నారు. మాట‌ల‌తో దూకుడు చూపించ‌డం మాత్ర‌మే కాదు.. ప‌క‌డ్బందీ వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ పార్టీని కూడా ప‌టిష్టం చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకుంటున్నారు రేవంత్ రెడ్డి.

నిజానికి అధిష్టానం పీసీసీ ప్ర‌క‌టించిన నాటి ప‌రిస్థితులు వేరు. సీనియ‌ర్లు వ‌ద్దంటే వ‌ద్ద‌ని అన్నారు. కానీ.. వారంద‌రి అభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి రేవంత్ నెత్తిన కిరీటం పెట్టింది అధిష్టానం. రాహుల్ గాంధీ త‌న‌పై ఉంచి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటున్నారు రేవంత్. ప్ర‌మాణ స్వీకారం చేసి ప‌ది రోజులు గ‌డ‌వ‌కుండానే.. త‌న మార్కు చూపిస్తున్నారు. సొంత పార్టీలో త‌న‌ను వ్య‌తిరేకించిన వారిని.. అనుకూలంగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని, ఇత‌ర పార్టీల్లోని వారిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చుందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. వెంట వెంట‌నే కీల‌క నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. అంద‌రి చూపూ త‌న‌వైపు తిప్పుకుంటున్నారు.

మొన్న‌టికి మొన్న‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ మేర‌కు రేవంత్ మాట్లాడ‌డం.. విశ్వేశ్వ‌ర్ రెడ్డి సానుకూలంగా స్పందించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ రావ‌డం ఆనందంగా ఉంద‌న్న విశ్వేశ్వ‌ర్ రెడ్డి.. కాంగ్రెస్ లో త్వ‌ర‌లోనే చేరుతాన‌ని చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. వెంట‌నే మ‌రో కీల‌క నేత‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పేందుకు రంగం సిద్ధం చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌రాఠా చంద్ర‌శేఖ‌ర్ అలియాస్ ఎర్ర శేఖ‌ర్ ను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి అల‌జ‌డి సృష్టించారు. 1995 నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న శేఖ‌ర్‌.. ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరారు. అయితే.. తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుంచీ రేవంత్ రెడ్డి - శేఖ‌ర్ మ‌ధ్య‌స‌త్సంబంధాలే ఉన్నాయి. దీంతో.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు కావ‌డంతో.. ఎర్ర శేఖ‌ర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మయ్యారు. ఈ మేర‌కు బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో కాంగ్రెస్ లో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ప్ర‌స్తుత టీఆర్ఎస్ నాయ‌కుడు డి. శ్రీనివాస్ కుమారుడు సంజ‌య్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ నేత‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన దేవేంద‌ర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్‌. దేవేంద‌ర్ తోపాటు ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌కు సైతం ఆహ్వానం ప‌లికారు. కాంగ్రెస్ నేత‌లు మ‌ల్లు ర‌వి, మ‌ధుయాష్కితో క‌లిసి రేవంత్ నివాసానికి వెళ్లి క‌లిశారు. కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చేందుకు వారు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ విధంగా.. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని, ఇత‌ర పార్టీల్లోని నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తూ.. కేడ‌ర్ లో కొత్త ఆశ‌లు రేకెత్తిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల కాలం ఉంది. పార్టీని అనుకున్న విధంగా బ‌లిష్టంగా త‌యారు చేయ‌డానికి రేవంత్ కు ఈ స‌మ‌యం స‌రిపోతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సీనియ‌ర్లు కూడా రేవంత్ కు స‌హ‌క‌రించ‌డం మిన‌హా.. చేయ‌గ‌లిగింది ఏమీ లేకుండా పోయింది.

ఇప్ప‌టికే.. రెండు సార్లు అధికారం కోల్పోయి ఉన్న నేప‌థ్యంలో.. వ‌చ్చేసారి గెల‌వ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించాల్సిన అనివార్య‌త కూడా ఉంది. దానికి.. ఆరంభం అన్న‌ట్టుగా రేవంత్ ప్ర‌య‌త్నాలు ఉన్నాయి. త్వ‌ర‌లో మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీల నాయ‌కులు, యువ‌కులు కూడా రేవంత్ నాయ‌క‌త్వాన్ని జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇది ఖ‌చ్చితంగా పార్టీకి శుభ ప‌రిణామ‌మేన‌ని కేడ‌ర్ తోపాటు పార్టీ బాగు కోరుకునే వారు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఏ స్థాయిలో రెప‌రెప‌లాడుతుందో చూడాలి.