Begin typing your search above and press return to search.

రాజధాని కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 Feb 2022 4:35 AM GMT
రాజధాని కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు కేసులపై విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దుకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీతో పాటు మరికొందరు వేసిన పిటీషన్లపై కోర్టు విచారిస్తోంది. శుక్రవారంతో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ ప్రభుత్వమే మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకున్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.

పై రెండు చట్టాలను ప్రభుత్వం రద్దు చేసుకున్న తర్వాత ఇక ఈ విషయాలపై విచారణ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. చట్టాలను ప్రభుత్వమే రద్దు చేసుకున్న తర్వాత ఇక ఈ అంశాలపై విచారణ అవసరం ఏమిటంటు కోర్టు పిటీషనర్లను సూటిగా ప్రశ్నించింది. ఈ నేపధ్యంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికి కోర్టు వెళ్లడం లేదని స్పష్టంగా చెప్పేసింది. కాకపోతే పిటిషనర్లు దాఖలు చేసిన కేసుల్లో ఏ అభ్యర్ధనలు మనుగడలో ఉంటాయని మాత్రమే ఆలోచిస్తున్నట్లు కోర్టు చెప్పింది.

ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయగానే తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు అమరావతి జేఏసీ పేరుతో మరికొందరు హైకోర్టులో కేసులు వేశారు. చాలాకాలంపాటు ఈ విచారణ జరిగింది. అయితే హఠాత్తుగా ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. అలాగే సీఆర్డీఏ చట్ట రద్దు ను కూడా ఉపసంహరించుకున్నట్లు చెప్పింది. అయితే ప్రభుత్వం వాదనను అంగీకరించవద్దంటు పిటీషనర్లు వాదనలు వినిపించారు.

ఇదే అంశంపై తాజాగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్ల వాదనను దాదాపు కొట్టేసినట్లుగానే సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం తర్వాత కూడా కోర్టులో వాదనలు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి అంతిమ తీర్పులో కూడా ఇలాగే ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి తొందరలోనే అంతిమ తీర్పు వస్తుందని అనుకోవాలి. మూడు రాజధానుల ఏర్పాటుపై సమగ్రమైన చట్టాన్ని తిరిగి తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి పిటిషనర్లు అవసరమని అనుకుంటే అప్పుడు మళ్ళీ కేసులు వేసుకునే అవకాశం ఉండవచ్చు.