Begin typing your search above and press return to search.

ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 Jun 2021 9:30 AM GMT
ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల వల్ల ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. పరీక్షల లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని.. ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వేలకొద్దీ పరీక్ష గదులను ఎలా అందుబాటులోకి తీసుకొచ్చి సమన్వయం చేస్తారు? పరీక్ష తర్వాత మూల్యాంకనం, చెకింగ్ ఎలా చేయిస్తారు? అంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

సెకండ్ వేవ్ దేశంలో ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో కళ్లారా చూశామని.. విద్యార్థులు, పరీక్షల విషయంలో ఇంత మొండిగా ముందుకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

ఒక్క మరణం కూడా జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లతో మీరు ముందుకొచ్చేవరకు.. వాటిపై మేం సంతృప్తి చెందేవరకు ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల నిర్వహణకు మేం అంగీకరించబోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం చెబుతున్న ఏర్పాట్లపై మేం సంతృప్తి చెందడం లేదని తెలిపింది. మీ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వ పత్రాలను చూపించాలని కోరింది. విద్యార్థుల జీవితాలతో ఇలా ఆటలాడడం తగదని హితవు పలికింది. తగిన వసతులు, సమాచారం ఇవ్వకపోతే పరీక్షలు రద్దు చేయాలని ఆదేశించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

మహారాష్ట్ర, కేరళ సహా అన్ని రాష్ట్రాలు రద్దు చేశాయని.. డెల్టా ప్లస్ రకం కూడా రాబోతోందని.. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణపై మీకు బాధ్యత ఉందని.. అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.