Begin typing your search above and press return to search.

అయేషా కేసు లో కీలక మలుపు

By:  Tupaki Desk   |   14 Dec 2019 11:14 AM IST
అయేషా కేసు లో కీలక మలుపు
X
అయేషా మీరా.. 2007లోనే మృగాళ్ల చేతిలో బలైన యువతి.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విజయవాడ ఫార్మసీ విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. 2007లో జరిగిన ఈ దారుణం పై ఎవరు చేశారో ఇప్పటికీ ఎవరూ తేల్చలేని పరిస్థితి. అయేషా ను చంపింది నాటి ముఖ్యనేత మనవడు అని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ హత్య జరిగింది. అయితే రాజకీయ అండదండలతో ఈ కేసులో ఓ చిల్లర దొంగను బూచీగా చూపి జైలు పంపారన్న విమర్శలున్నాయి.. కానీ ఆ చిల్లరదొంగను హైకోర్టు నిర్ధోషిగా విడుదల చేసి మళ్లీ సీబీఐ విచారణకు ఆదేశించింది.

తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అయేషా మీరా మృతదేహానికి ఫోరెన్సిక్, వైద్యుల సాయంతో రీపోస్టు మార్టం నిర్వహిస్తోంది. శనివారం ఉదయం తెనాలి చంచుపేటలో అయేషా మృతదేహానికి ఫోరెన్సిక్ , వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

అయేషా ముస్లిం కావడంతో తొలుత రీపోస్టుమార్టంకు మతపెద్దలు అంగీకరించలేదు. ఆరు నెలల క్రితమే సీబీఐ సిద్ధమవ్వగా అయేషా తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పారు. దీంతో హైకోర్టుకు సీబీఐ వెళ్లగా కోర్టు పోస్టుమార్టానికి అనుమతి ఇచ్చింది.

డిసెంబర్ 14న రీపోస్టుమార్టం చేయడానికి సీబీఐ రెడీ అయ్యింది. ఈమేరకు తెనాలి సబ్ కలెక్టర్ ద్వారా ఈద్గా మైదానంలో అధికారులు, పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య అయేషా సమాధిని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయేషా డెడ్ బాడీకి రీపోస్టుమార్టానికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.