Begin typing your search above and press return to search.

వివేకా కేసులో కీల‌క మ‌లుపు.. ఆయ‌న‌కు నార్కో ప‌రీక్ష‌ల‌పై సీబీఐ పిటిష‌న్‌..!

By:  Tupaki Desk   |   21 Dec 2021 1:30 PM GMT
వివేకా కేసులో కీల‌క మ‌లుపు.. ఆయ‌న‌కు నార్కో ప‌రీక్ష‌ల‌పై సీబీఐ పిటిష‌న్‌..!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా సిబిఐ పులివెందుల కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఈ కేసులో అరెస్టు అయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు అనుమతించాలని సీబీఐ కోరింది. ఈ కేసులో ముందునుంచి శివశంకర్ రెడ్డి కేంద్రంగా అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

నార్కో పరీక్షల కోసం త్వరలోనే శివశంకర్ రెడ్డి అనుమతిని సైతం కోర్టు కోరనున్నట్లు తెలుస్తోంది. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాదు నుంచి ఆయన్ను పులివెందులకు తీసుకువచ్చారు. శంకర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచగా ఆయన జైల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే శంకర్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు ఈ హత్య కేసులో తనకు సంబంధం లేదని... తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. వీళ్లు సిబిఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా... కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ కుట్రలో తాను భాగస్వామి అని చ‌ర్చ‌లు నిర్వహిస్తుండటం కూడా తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఈక్రమంలోనే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మొదటినుంచి రకరకాల ప్రకటనలు చేస్తూ దర్యాప్తు అధికారులకు పిటిషన్ల మీద పిటిష‌న్లు ఇస్తూ దర్యాప్తును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారంటూ అని కూడా చెప్పారు. ఇక వివేక భార్య సౌభాగ్యమ్మ‌ కూడా వారానికి రెండు మూడు సార్లు సిబిఐ అధికారులను కలవడం కూడా దర్యాప్తును ప్రభావితం చేయడమే అవుతుందని ఆయన ఆరోపించారు.

ఇక వివేకా అల్లుడు, సునీత భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారులతో కుమ్మ‌క్కు అయిన‌ట్టు కూడా ఆరోపించారు. వీరు ద‌స్త‌గిరి న్యాయ‌వాదిని నియ‌మించి.. ముంద‌స్తు బెయిల్ వ‌చ్చేలా చేశార‌ని కూడా ఆరోపించారు. ఏదేమైనా ఈ కేసులో ఇంకెన్ని మ‌లుపులు వ‌స్తాయో ? ఆస‌క్తిగా చూడాలి.