Begin typing your search above and press return to search.

కేఎఫ్‌సీలో అలాంటివన్నీ ఉన్నాయా?

By:  Tupaki Desk   |   26 Jun 2015 6:21 AM GMT
కేఎఫ్‌సీలో అలాంటివన్నీ ఉన్నాయా?
X
పెద్ద పెద్ద భవంతుల్లో అందంగా అలంకరించి.. రారమ్మంటూ పిలిచే ఆహార గొలుసుకట్టు షాపుల్లో వడ్డించే ఆహారపదార్ధాలను నిషేధించాలా? నిబంధనలకు విరుద్ధంగా వాటి ప్రమాణాలు ఉన్నాయా? లాంటి ప్రశ్నలు మనసులోకి వచ్చేలా తాజా వాదన ఒకటి బయటకు వచ్చింది.

మ్యాగీ న్యూడిల్స్‌ విషయంలో పెద్ద ఎత్తున రచ్చ జరిగి.. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు వినియోగించారన్న విషయం బయటకు వచ్చి.. దాన్ని బ్యాన్‌ చేయటం తెలిసిన విషయమే. తాజాగా పిల్లలు.. పెద్దలు అమితంగా ఇష్టపడే కేఎఫ్‌సీలో వండివార్చే ఆహారంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తేల్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని బాలల హక్కుల సంఘం సభ్యులు చెబుతున్నారు.

కేఎఫ్‌సీలో ఇచ్చిన పుడ్‌ని.. స్టేట్‌ ఫుడ్‌ ల్యాబరేటరీలో పరీక్షల నిమిత్తం ఇచ్చారు. దీన్ని పరీక్షించినప్పుడు విస్మయకర విషయాలు బయటకు వచ్చాయని.. ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈకోలి.. సాలంనెల్లా లాంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు.

వీటి కారణంగా వాంతులు.. విరోచనాలు.. టైఫాయిడ్‌ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. మ్యాగీ మాదిరే కేఎఫ్‌సీని కూడా నిషేధించాలని వారు కోరుతున్నారు. మరి.. ఈ విషయంపై తెలంగాణ సర్కారు స్పందిస్తే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. వాటి నాణత్య విషయంలోనూ మరిన్ని పరీక్షలు అవసరమన్న వాదన వినిపిస్తోంది. మరి.. కేసీఆర్‌ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.