Begin typing your search above and press return to search.

హత్యలకు కొత్త ఐడియాలు ఇచ్చిన కేజీఎఫ్?

By:  Tupaki Desk   |   14 May 2022 3:26 AM GMT
హత్యలకు కొత్త ఐడియాలు ఇచ్చిన కేజీఎఫ్?
X
ఒక సినిమా సమాజం మీద చూపించే ప్రభావం ఎంత? అన్న ప్రశ్నకు చాలా ఎక్కువనే మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. సామాన్య ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే మాధ్యమంగా సినిమాను చెబుతుంటారు. అందుకే.. సినిమా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. బాధ్యతగా వ్యవహరించాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే.. కన్నడ డబ్బింగ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్.. ఎంతటి సంచలన విషయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.

ఈ అనూహ్య విజయంతో కేజీఎఫ్ చాప్టర్ 2ను అత్యంత భారీగా నిర్మించటం.. అందుకు తగ్గట్లే భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో హీరో.. తన ప్రత్యర్థుల్ని చంపేందుకు సుత్తిని వాడతాడు. ఇప్పుడు పలువురు నేరస్తులు.. కొత్తగా నేరాలు చేసేందుకు దిగే వారు.. కేజీఎఫ్ మూవీలో మాదిరి సుత్తిని తమ ఆయుధంగా వాడుతున్న వైనం పెరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫేస్ బుక్ ప్రియుడ్ని.. మరో ప్రియుడి చేత మట్టుబెట్టించిన హైదరాబాద్ గృహిణి శ్వేతా రెడ్డి ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మీర్ పేటకు చెందిన ప్రశాంతి హిల్స్ కు చెందిన ఆమె ఫేస్ బుక్ లో ఇద్దరు ప్రియులతో ప్రేమాయణం నడపటం.

అందులో ఒకడు పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయటంతో పాటు.. ఆమె నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరించటంతో ఆమె తన మరో ప్రియుడి సాయం కోరి.. తనను బెదిరిస్తున్న ప్రియుడ్ని చంపేయాలని కోరటం.. అందుకు ఓకే చెప్పి సుత్తితో బలంగా కొట్టటం.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించిన వైనం తెలిసిందే.

అంతేకాదు.. అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన జంట హత్య కేసులోనూ నిందితుడు సుత్తినే ఆయుధంగా చేసుకొని చంపేయటం తెలిసిందే. కేజీఎఫ్ లో ప్రత్యర్థుల్ని అంతమొందించేందుకు సుత్తిని ఆయుధంగా వాడి చంపేయటం చూపిస్తే.

దాన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పలు హత్యలకు కేజీఎఫ్ లో హీరో ఆయుధం (సుత్తి) కీలకంగా మారటం గమనార్హం. సినిమాలు జనాల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయనటానికి ఇదో నిదర్శనంగా పోలీసు అధికారులు తమ మాటల్లో చెబుతున్నారు.