Begin typing your search above and press return to search.

ఖైర‌తాబాద్ కాంగ్రెస్ లో మూడు ముక్క‌లాట‌..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 PM GMT
ఖైర‌తాబాద్ కాంగ్రెస్ లో మూడు ముక్క‌లాట‌..!
X
వ‌ర్గ‌పోరుకు వేదిక‌గా మారిన తెలంగాణ కాంగ్రెస్ కు మ‌రో ఇబ్బంది వ‌చ్చి ప‌డిందా..? ఖైర‌తాబాద్ రాజ‌కీయాలు ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయా..? పీజేఆర్ త‌న‌య విజ‌యారెడ్డి చేరిక‌తో నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో గ్రూపు త‌యారుకానుందా..? అసెంబ్లీ సీటు కోసం ఇప్ప‌టికే ఇద్ద‌రు వెయిటింగ్ లో ఉండ‌గా ఆమె కూడా ఖ‌ర్చీఫ్ వేసేశారా? వీరిలో అధిష్ఠానం మ‌ద్ద‌తు ఎవ‌రికి ద‌క్కుతుంది..? అనే ప్ర‌శ్న‌లు పార్టీ శ్రేణుల‌ను తొలుస్తున్నాయి.

ఒక‌ప్పుడు దేశంలోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గంగా ఖైర‌తాబాద్ గుర్తింపు పొందింది. కాంగ్రెస్ త‌ర‌పున ఇక్క‌డి నుంచి పి. జ‌నార్ద‌న్ రెడ్డి ప‌లుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప‌లు మంత్రి ప‌ద‌వులు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రిగా ఆయ‌న ఆ ప‌ద‌వికే వ‌న్నె తెచ్చారు. హైద‌రాబాద్ వాసుల క‌ష్టాలు తీర్చి ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కార్మికుల‌కు, బ‌స్తీ వాసుల‌కు ఆయ‌న దేవుడిగా నిలిచారు. అందుకే ఆయ‌న మ‌ర‌ణానంత‌రం అంత్య‌క్రియ‌ల్లో వేలాదిగా ప్ర‌జ‌లు వ‌చ్చి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.

అంత‌టి మ‌హానుభావుడి వార‌సుడిగా గుర్తింపు పొందిన ఆయ‌న కుమారుడు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి తండ్రి ఆశ‌యాల‌ను నిల‌బెట్ట‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. తండ్రి మ‌ర‌ణంతో ఉప ఎన్నిక‌లో ఒక‌సారి.., త‌ర్వాత వైఎస్ హ‌వాలో మ‌రోసారి గెలిచిన విష్ణు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ముఖం చాటేస్తున్నారు.

క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ కేవ‌లం టికెట్ల స‌మ‌యంలో మాత్ర‌మే ముందుకు వ‌స్తున్నారు. అందుకే ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను రెండుసార్లు దూరం పెట్టారు. ఇపుడు విజ‌యారెడ్డి కాంగ్రెసులో చేరిక‌తో తిరిగి పూర్వ‌పు రోజులు వ‌స్తాయ‌ని నేత‌లు భావిస్తున్నారు.

అయితే.. ఇక్క‌డే ఒక చిక్కు వ‌చ్చి ప‌డింది. ఖైర‌తాబాద్ నుంచి విడిపోయిన‌ జూబ్లీహిల్స్‌, కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆమె ఏ స్థానం నుంచి బ‌రిలో దిగుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె సోద‌రుడు యాక్టివ్ రోల్ తీసుకోనందున జూబ్లీహిల్స్ నుంచే బ‌రిలో ఉండాల‌ని స‌న్నిహితులు సూచిస్తున్నారు. పార్టీ కూడా జూబ్లీహిల్స్ లేదా కూక‌ట్ ప‌ల్లి నుంచి అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పింద‌ట‌. అయితే విజ‌యారెడ్డి మాత్రం.. ప్ర‌స్తుతం ఖైర‌తాబాద్ కార్పొరేట‌ర్ గా ఉన్నందున ఆ అసెంబ్లీ సీటు కోసమే కాంగ్రెసులో చేరిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆమె ఖైర‌తాబాద్ నుంచే గ‌ట్టిగా ప‌ట్టుబ‌డితే కాంగ్రెస్ కు కొత్త చిక్కులు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే ఇక్క‌డ ఇద్ద‌రు నేత‌లు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్‌, సినీ నిర్మాత రోహ‌ణ్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకుంటున్నారు. అన్ని అంశాల‌పై మంచి ప‌ట్టున్న దాసోజుకు అధిష్ఠానం వ‌ద్ద కూడా గుర్తింపు ఉంది. బీసీ కోటాలో టికెట్ ఆశిస్తున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌తో సంబంధాలు ఉన్న రోహ‌ణ్ రెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా ఉన్నారు. పార్టీ చీఫ్ రేవంత్ మ‌ద్ద‌తు కూడా ఈయ‌న‌కే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో విజ‌యారెడ్డి చేరిక ఎవ‌రికి ఎస‌రు పెడుతుందో వేచి చూడాలి.