Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి విశేషాలెన్నో..

By:  Tupaki Desk   |   13 Sep 2018 10:53 AM GMT
ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి విశేషాలెన్నో..
X
తెలుగు రాష్ట్రాల మొత్తం మీద అతిపెద్ద వినాయకుడిని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్ఠిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రతి ఏడాది విభిన్నమైన రంగుల్లో - రూపాల్లో ఖైరతాబాద్ గణేషుడు దర్శనమిస్తుంటాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ గణేశుడిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గత 64 ఏళ్లుగా ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఖైరతాబాద్ గణేషుడిని ఈసారి వినూత్నంగా తీర్చిదిద్దారు.

సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు ఈరోజు కొలువుదీరాడు. ఏడు ఆదిశేషుల పడగల నీడలో.. ఏడు ముఖాలు - 14 చేతులతో లక్ష్మీ - సరస్వతి సమేతుడై 57 అడుగుల ఎత్తు - 27 అడుగుల వెడల్పుతో నిండైన రూపంతో భక్తులకు ఈరోజు దర్శనమిచ్చాడు. గురువారం నుంచి 11 రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు. గణేషుడుని ప్రతిష్టించాక అపద్ధర్మ మంత్రులు తలసాని - నాయిని - మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిలు తొలి పూజలు చేశారు. ఈ గణేషుడి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు తలసాని తెలిపారు.

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి తయారీలో ఎంతో జాగ్రత్త కనబరిచారు. ఈ ప్రతిమకు పురాణేతిహాసాన్ని జోడించారు. భక్తుల కష్టాలు తొలగించే విధంగా రూపొందించారు. ఈ ఏడాది భక్తుల సర్పదోషాలను నివారించేందుకు ఈ సప్తముఖుడిని సిద్ధాంతులు - పండితులు కలిసి రూపకల్పన చేశారు. మహాశిల్పి రాజేంద్రన్ ఈ రూపాన్ని తయారు చేశారు.

ఈ సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని.. విగ్రహ రూపకర్త జ్యోతిర్మయి పీఠాధిపతి విఠల్ శర్మ సిద్దాంతి తెలిపారు. ఏడు పడుగలు ఏడు కాలాలను సూచిస్తుందని.. సర్పదోష నివారణ కోసం కాళహస్తి వెళితే ఎలాంటి పుణ్యం వస్తుందో.. ఈ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నా అలాంటి ఫలితం వస్తుందని తెలిపారు.

ఖైరతాబాద్ గణేషుడిని వేల సంఖ్యలో ప్రజలు దర్శించుకుంటారు కాబట్టి హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ 11 రోజుల పాటు మింట్ కాంపౌండ్ - నెక్లస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ మండపం వైపు అనుమతించమని తెలిపారు. ప్రభుత్వ మింట్ కాంపౌండ్ నుంచి వాహనాలను దారి మళ్లిస్తామని వివరించారు.