Begin typing your search above and press return to search.

'గులాబీ'కి చిక్కని 'ఖమ్మం'.. ఆదినుంచి ఇదే కథ

By:  Tupaki Desk   |   10 Jan 2023 6:36 AM GMT
గులాబీకి చిక్కని ఖమ్మం.. ఆదినుంచి ఇదే కథ
X
తెలంగాణలో గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయం చేస్తోంది. అధికారంలో ఉన్న ఈ పార్టీ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలను చేజిక్కించుకుంది. ప్రతీ జిల్లాలో సర్పంచ్ ల నుంచి ఎంపీల వరకు బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం తన మార్క్ ను చూపించలేకపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ జిల్లాలో రెండుసార్లు ఒకే ఒక్క సీటు గెలచుకుంది. మిగతా స్థానాలు ఇతర పార్టీలే చేజిక్కించుకుంటున్నాయి. అయితే పార్టీ అధినేత కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. తాజాగా ఖమ్మంలో గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ఖమ్మంలో బీఆర్ఎస్ తొలిసభను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఖమ్మం అసంతృప్తి తగ్గనుందా..?

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు మొదటి నుంచి కలిసి రావడం లేదు. 2014, 2018 ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి గులాబీ పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చింది. ఇతర పార్టీల నుంచి ఈ జిల్లాలో గెలిచివారు బీఆర్ఎస్ లోకి చేరినా వారంతా ఒక్క తాటిపైకి రావడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా సాగుతున్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి పువ్వాడ అజయ్ మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఆయన కంట్రోల్ లో పార్టీ నాయకులు లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు. అటు తుమ్మల నాగేశ్వర్ రావు కదలికలపై అనుమానాలు కొనసాగుతున్నాయి.

బీఆర్ఎస్ కు ఖమ్మంలో అలాంటి పరిస్థితి రావడానికి కేసీఆర్ ఆనుసరిస్తున్న విధానాలే కారణమి తెలుస్తోంది. మొదటి నుంచీ ఏ ఒక్క నాయకుడిని నమ్మకుండా సందర్భాన్ని బట్టి నాయకులకు టిక్కెట్లు ఇవ్వడంపై ఎవరికీ పట్టు లేకుండా పోయింది. 2014లో ఈ జిల్లాలో పెద్దగా కేడర్ లేకపోయినా ఒకస్థానం గెలుచుకుంది. 2018నాటికి కాస్త పుంజుకుంది.

అయితే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోయారు. కానీ అతనిని పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ద్వారా కేబినేట్లోకి తీసుకున్నారు. అయితే ఆయనకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. ఆ తరువాత పువ్వాడ అజయ్ కు అవకాశం ఇచ్చారు. కొన్ని నెలల తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రోత్సహించారు. దీంతో ఈ ప్రభావం 2018 ఎన్నికల్లో బాగా కనిపించింది.

2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును పొంగులేటికి ఇచ్చారు. మరోవైపు టీడీపీ నుంచి నామా నాగేశ్వర్ రావును చేర్చుకొని గెలిపించుకున్నారు. ఈ సమయంలో తుమ్మల నాగేశ్వర్ రావును పట్టించుకోలేదు. అయితే ఇదే సమయంలో విదేశాల్లో బిజినెస్ చేసుకుంటున్న తాతా మధును పార్టీలోకి తీసుకొని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అప్పటికే పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న పొంగులేటి, తుమ్మలకు ఇది నచ్చలేదు. దీంతో పార్టీ గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలోనే ఎవరికి వారే అన్నట్లుగా సాగుతోంది. ఈ విషయాన్ని బాగా గ్రహించిన టీడీపీ అధినేత ఇటీవల ఇక్కడ బహిరంగసభను పెట్టి తెలంగాణలో తమ పార్టీకేడర్ ఇంకా ఉందని చెప్పబోయారు. అయితే ఇప్పటికీ పట్టించుకోకపోతే ఈ జిల్లా పూర్తిగా చేజారుతుందని గ్రహించిన కేసీఆర్ ఈనెల 18న ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మరోవైపు సభ బాధ్యతలను చేపట్టాలని తుమ్మల నాగేశ్వర్ రావును ఫోన్ లో సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ సభతో ఇక్కడున్న అసంతృప్తి తొలిగిపోయే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.