Begin typing your search above and press return to search.

బీజేపీలోకే ఖమ్మం ఆ మాజీ ఎంపీ?

By:  Tupaki Desk   |   3 Jan 2023 6:29 AM GMT
బీజేపీలోకే ఖమ్మం ఆ మాజీ ఎంపీ?
X
గత రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశం అవుతున్నాయి. 2018కి ముందు కీలక స్థానాల్లో ఉండి.. ఆ తర్వాతి ఎన్నికల్లో టికెట్ రాకనో, ఓడిపోయో రాజకీయంగా వెనుకబడిన ఇద్దరు ప్రభావవంతమైన నేతలు ఇప్పుడు మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. వీరికి ప్రజాక్షేత్రంలోనూ పలుకుబడి ఉండడంతో వారి కదలికలు, వ్యాఖ్యలు అందరి నోళ్లలో నానుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది కూడా లేని నేపథ్యంలో వారిద్దరి భవిష్యత్ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తి రేపుతోంది.

కమలం గట్టి ప్రయత్నం?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2004 తర్వాత అనూహ్యంగా ఎదిగిన ఆ నాయకుడు 2014 నాటికి ఎంపీగానూ గెలిచారు. అది కూడా తెలంగాణలో పెద్దగా పట్టులేని పార్టీ టిక్కెట్ పై. దీంతో పాటు తన అనుచరులు ముగ్గురిని ఎమ్మెల్యేలుగానూ గెలిపించుకున్నారు. తర్వాత మారిన పరిస్థితుల్లో ఆ ఎంపీ, ఎమ్మెల్యేలతో అధికార టీఆర్ఎస్ లో చేరారు. అయితే, మరోవైపు నుంచి బలమైన నాయకులు కూడా టీఆర్ఎస్ లోకి రావడంతో రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇది కాస్తా విభేదాలుగా మారి 2018 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఒకరి ఓటమికి మరొకరు పావులు కదిపారనే అపవాదులు మూటగట్టుకున్నారు.

ఓవైపు మహా కూటమిని తట్టుకుంటూ రాష్ట్రమంతటా నాడు టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ ఊసే లేకపోయింది. మొత్తం 10 సీట్లకు గాను ఒకే ఒక్క స్థానంలో గెలవగలిగింది. ''టార్గెట్ 100'' పెట్టుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఇది తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉమ్మడి ఖమ్మంలో ఆధిపత్య పోరు ప్రభావం టార్గెట్ 100పై పడడంతో రెండు వర్గాల వారిని పక్కనపెట్టింది.

మధ్యేమార్గంలో మరో కీలక నేతకు మంత్రి పదవి ఇచ్చింది. ఉమ్మడి ఖమ్మంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఈయనే కావడంతో మార్గం మరింత సుగమమైంది. కాగా, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ఆ మాజీ ఎంపీ తన రాజకీయ భవిష్యత్ ఏమిటనేది ఆలోచించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆయనను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అటు సాన్నిహిత్యం.. ఇటు ఒత్తిడి

మాజీ ఎంపీ.. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధిష్ఠానం కీలక నేతకు అత్యంత సన్నిహితులు. పదవులేమీ లేకుండా నాలుగేళ్లు ఉండిపోయిన ఆయన ఎన్నికల సంవత్సరంలో పార్టీ మారతారా? అనేది సందేహం. దీనికితోడు అధిష్ఠానం కీలక నేత మాటను దాటి వెళ్తారా? అనేది కూడా చూడాలి. మరోవైపు ఎంపీ టిక్కెట్ ఇద్దామన్నా అవకాశం లేదు. అందుకనే జిల్లాలోని కొత్తగూడెం టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది.

అక్కడ నాయకత్వం బలహీనంగా ఉండడమూ కలిసొస్తోంది. అయితే, ఆ మాజీ ఎంపీపై బీజేపీ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక ఆ నాయకుడు సైతం.. ''టిక్కెట్ రాకుంటే చూద్దాం.. అయినా టిక్కెట్ ఇవ్వబోమని అధిష్ఠానం చెప్పలేదుగా?'' అంటున్నారు. వెరసి.. ఆయన అడుగులు మాత్రం కమలం వైపే ఎక్కువగా ఉన్నాయి. అదికూడా అధికార పార్టీలో జరిగే పరిణామాల ఆధారంగానే..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.