Begin typing your search above and press return to search.

రష్యా చేజార్చుకున్న కీలక నగరం ఇదే!

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:45 AM GMT
రష్యా చేజార్చుకున్న కీలక నగరం ఇదే!
X
తన పొరుగు దేశం, ఒకప్పటి సోవియన్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌.. అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమికి దగ్గరవుతోందని ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలయిన యుద్ధం ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా ముగియలేదు. సంధి ప్రయత్నాలకు ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రెండు దేశాలు మంకు పట్టు వేసుకు కూర్చున్నాయి.

యుద్ధం మొదట్లో సులువుగా ఉక్రెయిన్‌ను జయించేలా కనిపించింది రష్యా. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో కీలక ప్రాంతంలో ఉన్న ఖేర్సన్‌ నగరాన్ని ర ష్యా ఒడిసిపట్టింది. ఆ తర్వాత ఒక్కో నగరాన్ని ఒడిసిపడుతూ ముందుకు సాగింది. మొదట్లో రష్యా ధాటికి చేతులెత్తేసిన కనిపించిన ఉక్రెయిన్‌... అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్‌ గట్టి పోరు సాగిస్తోంది.

రష్యా తమ నుంచి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌ ధాటికి ఇప్పటికే లక్ష మంది రష్యన్‌ సైనికులు మరణించారని అంచనా. తాజాగా ఖేర్సన్‌ నగరాన్ని కూడా ఉక్రెయిన్‌ తిరిగి దక్కించుకుంది. స్వయంగా ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి సెర్గా షొయిగు ప్రకటించారు.

వాస్తవానికి ఖేర్సన్‌ సహా మరో ఉక్రెయిన్‌ నగరాలను తాము స్వాధీనం చేసుకున్నామని దాదాపు నెల క్రితం రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

తాజాగా ఖెర్సన్‌ నుంచి సేనల ఉపసంహరణ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు వెల్లడించడం ఇందుకు నిదర్శనం. ఓటమిని రష్యా బహిరంగంగా అంగీకరించడమే చాలా ఆసక్తికరమని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బలను రష్యా అధికారికంగా అంగీకరించదని అంటున్నారు.

ఉక్రెయిన్‌ దాడులను ముమ్మరం చేయడంతో ఖేర్సన్‌పై పట్టు బిగించడం తమకు దాదాపు అసాధ్యంగా మారిందని రష్యా సైనికాధికారి ఒకరు తెలిపారు. ఖేర్సన్‌ను వదిలేసి నిప్రో నది పశ్చిమ తీరాన సేనలను మోహరిస్తే తమ స్వాధీనంలోని మిగతా ప్రాంతాలను కాపాడుకోవచ్చని రష్యా ఉద్దేశమంటున్నారు. నిప్రో నది ప్రవాహం ఉక్రెయిన్‌ సేనలను నది దాటకుండా అడ్డుకుంటుందని రష్యా భావిస్తోంది.

మొత్తంమీద ఖేర్సన్‌ నగరం నుంచి రష్యా నిష్క్రమణ యుద్ధగతిని పూర్తిగా మార్చేయడం ఖాయంగా కన్పిస్తోందని చెబుతున్నారు. ఇది గెలుపోటములను శాసించేలా ఉందంటున్నారు. ఇది రష్యాకు మింగుడు పడని పరిణామం కానుందని స్పష్టం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.