Begin typing your search above and press return to search.

త‌లాక్ క్రెడిట్ ఎవ‌రికి వ‌స్తుందంటారు ఖుష్బూ

By:  Tupaki Desk   |   23 Aug 2017 8:45 AM GMT
త‌లాక్ క్రెడిట్ ఎవ‌రికి వ‌స్తుందంటారు ఖుష్బూ
X
కొన్ని త‌ప్పులు చేసేట‌ప్పుడు అస్స‌లు తెలీవు. తాము చేస్తుందంతా క‌రెక్టేన‌ని అనుకుంటారు. కానీ..తామెంత త‌ప్పు చేశామ‌న్న విష‌యం కొంత కాలానికి మాత్ర‌మే తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. సెక్యుల‌ర్ పార్టీగా గొప్ప‌లు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ముస్లిం మ‌హిళ‌లు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న ట్రిపుల్ త‌లాక్ ఇష్యూ మీద ఫోక‌స్ చేసిందే లేదు.

పురుషాధిక్య స‌మాజంలో.. అందునా ముస్లిం ఓటు బ్యాంకును ముస్లిం పురుషుల‌తో నిండి ఉంటుంద‌ని.. వారి ప్ర‌భావంతోనే ముస్లిం మ‌హిళ‌లు ఉంటార‌న్న భావ‌న‌తో ద‌శాబ్దాలుగా ట్రిపుల్ త‌లాక్‌ను ఉద్దేశ్య‌పూర్వ‌కంగా నిర్ల‌క్ష్యం చేస్తుంద‌న్న విమ‌ర్శ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే ట్రిపుల్ త‌లాక్ లాంటి దుర్మార్గ విధానానికి చెక్ పెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నించ‌లేదు. అయితే.. ఈ విష‌యంలోని లోతుపాతుల మీద దృష్టి సారించిన బీజేపీ.. ట్రిపుల్ త‌లాక్‌ను వ్య‌తిరేకించ‌ట‌మేకాదు.. ముస్లిం మ‌హిళ‌ల్ని త‌మ వాద‌న‌ల‌తో ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యారు.

ట్రిపుల్ త‌లాక్ పై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు విష‌యంలో క్రెడిట్ ఎవ‌రికి వెళుతుంద‌న్న విష‌యం మీద ఎవ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. కానీ.. ఈ ఇష్యూ మీద ఇప్పుడు వితండ‌వాదానికి దిగుతూ.. పార్టీ ప‌రువు బ‌జారున ప‌డేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు న‌టి.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ఖుష్బూ సుంద‌ర్‌.

ట్రిపుల్ త‌లాక్ విజ‌యాన్ని బీజేపీ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తుంద‌ని.. కానీ ఇది బీజేపీ క్రెడిట్ కాద‌ని ఆమె చెబుతున్నారు. ట్రిపుల్ త‌లాక్ విజ‌యం భార‌తీయ మ‌హిళ‌ల విజ‌యంగా ఆమె అభివ‌ర్ణిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఖుష్బూ లాంటి వారు ట్రిపుల్ త‌లాక్ క్రెడిట్ బీజేపీకి ఇవ్వ‌నంత మాత్రాన‌.. పోకుండా ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ట్రిపుల్ త‌లాక్ మీద కాంగ్రెస్ నేత‌లు సుప్రీంలో ఎలాంటి వాద‌న‌లు వినిపించారో అంద‌రికి తెలిసిన త‌ర్వాత కూడా ఖుష్బూ లాంటి వారు మాట్లాడే మాట‌లు పార్టీకి మ‌రింత చేటు క‌లిగిస్తాయ‌ని గుర్తిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.