Begin typing your search above and press return to search.

కియా సంచ‌ల‌నం.. ఏపీలో 54 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు

By:  Tupaki Desk   |   28 May 2020 12:30 PM GMT
కియా సంచ‌ల‌నం.. ఏపీలో 54 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు
X
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురము జిల్లాలో కార్ల త‌యారీ కంపెనీ కియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రం నుంచి త‌ర‌లిపోతుంద‌ని వ‌చ్చిన వార్త‌ల నుంచి ఇప్పుడు ఉన్న ప్లాంట్‌నే విస్త‌రిస్తామ‌ని.. తాజాగా 54 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే ప్ర‌క‌టించ‌డం విశేషం. గ‌తంలోనే అనంత‌పుర‌ములో ఉత్ప‌త్తి కేంద్రం ఏర్పాటుచేసిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు కియా కార్లు సరఫరా అవుతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్లాంట్‌ను విస్త‌రిస్తామ‌ని కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) కుక్యుమ్ షిమ్ ప్ర‌క‌టించారు.

తాడేప‌ల్లిలో గురువారం ‘మన పాలన-మీ సూచన’లో భాగంగా పారిశ్రామిక రంగంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్షించి ఆ శాఖ ప్ర‌గ‌తిని వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే స‌మావేశానికి పారిశ్రామికవేత్త‌లు హాజ‌ర‌య్యారు. వారిలో కియా సంస్థ ప్ర‌తినిధులు కూడా ఉన్నారు. ఈ స‌మావేశంలో సీఈఓ కుక్యుమ్ షిమ్ మాట్లాడుతూ పెట్టుబ‌డుల ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామ‌ని, మరో 54 మిలియన్‌ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్ర‌క‌టించారు. కియా ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీ కోసం కొత్తగా ఈ పెట్టుబడులు పెడుతున్న‌ట్లు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. సముద్రతీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైలు మార్గాలు అన్నీ అనువుగానే ఉన్నాయని వివ‌రించారు. గ‌తంలో రాష్ట్రం నుంచి కియా వెళ్లిపోతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని గుర్తుచేశారు. ఈ విష‌య‌మై కియా కంపెనీ ప్ర‌తినిధులను ఆరా తీయ‌గా తాము ‌ఎక్కడికి వెళ్లడం లేదని చెప్పార‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో 32 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఏడాదిలో మొత్తం 35 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. మరో 1,466 కంపెనీల ఏర్పాటుకు 600 ఎకరాలు కేటాయించామని, ఏపీలో కంపెనీల ఏర్పాటుకు 20 ప్రముఖ సంస్థల ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు.