Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త ర‌చ్చ‌!... కియ‌ ఎవ‌రి ఘ‌న‌త‌?

By:  Tupaki Desk   |   30 March 2019 5:26 PM GMT
ఏపీలో కొత్త ర‌చ్చ‌!... కియ‌ ఎవ‌రి ఘ‌న‌త‌?
X
ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ఆకాశాన్నంటిన వేళ‌... ప్ర‌తి చిన్న విష‌యం కూడా పెద్ద ర‌చ్చ‌కే దారి తీస్తోంది. ఇలాంటి ప‌రిస్థితిలో ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించిన జ‌గ‌న్ కొత్త చ‌ర్చ‌కు తెర లేపార‌ని చెప్పాలి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత క‌నీసం రాజ‌ధాని కూడా లేకుండా తీవ్ర ఆర్థిక లోటుతో ప్ర‌యాణం మొద‌లెట్టిన న‌వ్యాంధ్ర త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాలంటే... ప‌రిశ్ర‌మ‌లు పెద్ద సంఖ్య‌లో రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఇదే భావ‌న‌తో ఉన్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు చాలా దేశాలే చుట్టివ‌చ్చారు. కొన్ని సార్లు మంచి ఫ‌లితాల‌ను సాధించిన ఆయ‌న మరికొన్ని సార్లు ఫ‌లితాలు రాబ‌ట్టలేద‌నే చెప్పాలి. అయితే ఈ ఐదేళ్ల‌లో రాష్ట్రానికి వ‌చ్చిన భారీ ప‌రిశ్ర‌మ‌ల్లో కియ కార్ల కంపెనీ ఒక‌టి. క‌రువు నేల అనంత‌పురం జిల్లాలో కొరియాకు చెందిన ఈ కంపెనీ త‌న ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే... కియ నెల‌ల వ్య‌వ‌ధిలోనే ప్లాంటును ఏర్పాటు చేయ‌డంతో పాటుగా త్వ‌ర‌లోనే ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించ‌నుంది.

ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకురాడంలో చంద్ర‌బాబు మంత్రాంగ‌మే ప‌నిచేసింద‌ని, దీంతో ఈ ఘ‌న‌త త‌మ‌దేన‌ని టీడీపీ స‌ర్కారు చెప్పుకుంటోంది. ఇలాంటి త‌రుణంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిమిత్తం నేడు అనంత‌పురం జిల్లాకు వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... కియ కార్ల ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. కియ కార్ల కంపెనీ రాష్ట్రానికి రావ‌డంలో చంద్ర‌బాబు ఘ‌న‌త ఏమీ లేద‌ని, ఈ కంపెనీని రాష్ట్రానికి ర‌ప్పించ‌డం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఘ‌న‌తేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా అగ్గి రాజుకుంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు చాలా వేగంగానే స్పందించారు. కియ కార్ల కంపెనీని ఏపీకి తీసుకురావ‌డం త‌మ ప్ర‌భుత్వ ఘ‌న‌తేన‌ని, ఇందులో కేంద్ర ప్ర‌భుత్వ పాత్ర ఎంత‌మాత్రం లేద‌ని ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అంతేకాకుండా భార‌త్ లో త‌న ఉత్ప‌త్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు కియ సిద్ధ‌మైతే... దానికి అన్ని ర‌కాలుగా ఏపీలోని అనంత‌పురం జిల్లా సానుకూలంగా ఉంటుంద‌ని, అంతేకాకుండా... ఏపీలో ప్లాంట్ పెడితే తాము బోలెడ‌న్ని రాయితీలు ఇవ్వ‌డంతో పాటుగా అన్ని ర‌కాలుగా అండ‌గా నిలుస్తామ‌ని కియ‌కు భ‌రోసా ఇచ్చామ‌ని చెప్పారు.

అయితే తాము కియ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలోనే మోదీ కూడా కియ‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు కియ యాజ‌మాన్యం సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఆ ప్లాంట్ ను మోదీ త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ కు త‌ర‌లించేందుకు య‌త్నించార‌ని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే మోదీ చెప్పిన మాట‌ల‌ను కియ యాజ‌మాన్యం న‌మ్మ‌లేద‌ని, త‌న మాట‌నే ఆ యాజ‌మాన్యం విశ్వ‌సించింద‌ని, ఈ క్ర‌మంలోనే మోదీ ప్ర‌తిపాద‌న‌ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టేసిన కియ ఏపీలో త‌న ప్లాంట్ ఏర్పాటుకు అంగీక‌రించింద‌ని చంద్రబాబు చాలా సుదీర్ఘ వివ‌ర‌ణే ఇచ్చారు. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా గుజ‌రాత్ లో ప్లాంట్ ఏర్పాటు చేసే దిశ‌గా కియ యాజ‌మాన్యంపై మోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చార‌ని కూడా చంద్రబాబు ఆరోపించారు. తాను ఇచ్చిన భ‌రోసాతో కియ ప్ర‌ధాని హోదాలో ఉన్న మోదీ ఒత్తిడిని కూడా ప‌క్క‌న‌పెట్టేసి, ఏపీలో త‌న ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు అంగీక‌రించింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో కియ ఘ‌న‌త మోదీద‌ని జ‌గ‌న్‌... కాదు ఆ ఘ‌న‌త త‌న‌దేన‌ని చంద్ర‌బాబు చెప్పడంతో ఇప్పుడు ఈ అంశంపై ఇరు వ‌ర్గాల నుంచి మాట‌ల తూటాలు పేలేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని చెప్పాలి.