Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన ఆంధ్రా కారు కియా

By:  Tupaki Desk   |   9 Aug 2019 5:32 AM GMT
హాట్ టాపిక్ గా మారిన ఆంధ్రా కారు కియా
X
మేడిన్ జపాన్.. జర్మనీ.. అమెరికా అన్నది చూశాం, అలాంటిది తెలుగు నేల మీద మేకిన్ చేసే కారు గురించి కలలు కనటమే తప్పించి వాస్తవరూపం దాల్చింది లేదు. ఇప్పుడు ప్రతి తెలుగోడు.. అందునా ఆంధ్రోడు ఆనందించేలా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తయారు చేసిన కియా సెల్టోస్ కారును తాజాగా రిలీజ్ చేయటం తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలకు సైతం ఆంధ్రా నుంచే ఎగుమతులు చేయనున్నారు. ఈ కారును ఈ నెల 22న రోడ్ల మీదకు వచ్చేలా డేట్ ఫిక్స్ చేశారు.

గత నెల (జులై) 16న ప్రీ బుక్సింగ్ ప్రారంభించగా.. కేవలం మూడు వారాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 23,311 కార్లు బుక్ అయ్యాయి. దక్షిణ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన సెల్టోస్ కారు మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తమ తాజా కారును దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టెస్ట్ చేసిన తర్వాతే పూర్తిస్థాయి ఉత్పత్తిని షురూ చేసినట్లుగా కియా మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ వెల్లడించారు

ఈ కార్ల పరిశ్రమ కోసం 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ కార్ల కంపెనీ కారణంగా 11వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఇందులో శాశ్విత సిబ్బంది 4వేల మంది కాగా తాత్కాలిక సిబ్బంది 7వేల మంది ఉంటారు. అనంతపురం జిల్లా రూపురేఖల్ని మార్చటంలో కియా కీలకమని చెప్పాలి.

అనంతపురం జిల్లా డెవలప్ మెంట్ విషయానికి వస్తే.. కియా ముందు కియా తర్వాత అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. అనంతపురం జిల్లా పెనుగొండలో సుమారు 536 ఎకరాల్లో కియా ప్లాంట్ ను ప్రారంభించారు. ఏడాదికి 3 లక్షల కార్లు తయారు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రానున్న రోజుల్లో ఏడాదికి 7 లక్షల యూనిట్లకు ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో ఇదే ప్లాంట్ నుంచే హైబ్రిడ్.. ఎలక్ట్రిక్ వామనాల్ని కూడా తయారు చేసేలా ఈ ప్లాంట్ ను సిద్ధం చేశారు.