Begin typing your search above and press return to search.

అతడు ఓడినా చరిత్రే.. లేచినట్టేనా మళ్లీ..

By:  Tupaki Desk   |   20 Dec 2021 11:50 AM GMT
అతడు ఓడినా చరిత్రే.. లేచినట్టేనా మళ్లీ..
X
2014లో చైనా ఓపెన్..2015లో ఇండియా ఓపెన్.. 2017లో ఏకంగా నాలుగు టైటిళ్లు.. సింగపూర్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌,డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఆపై 2018 లో కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ టీం స్వర్ణం, పురుషుల సింగిల్స్‌ రజతం... ఇదీ ఓ క్రీడాకారుడి గ్రాఫ్ పైపైకి వెళ్తున్న సందర్భంలో.. 4 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు.. అందులో వారం వ్యవధిలోనే రెండు గెలిచిన ఆటగాడు మరో మెట్టు ఎక్కే స్థితిలో వెనుకబడ్డాడు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు నుంచి కిందికి జారాడు. భారత పురుషుల బ్యాడ్మింటన్‌లో ప్రకాశ్‌ పదుకొనె సాధించినప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్యం, గోపీచంద్‌ 2001లో నెగ్గిన ఆల్‌ఇంగ్లాండ్‌ టైటిల్‌ గురించే మనకు బాగా తెలిసిన సందర్భంలో.. మరోభారత ఆటగాడు అద్వితీయ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. కానీ, అనూహ్యంగా కిందకు పడిపోయాడు. ఎంతగా అంటే.. అతడుప్రాతినిధ్యం వహిస్తున్నా.. పతకం కాదు కదా..? కనీసం మ్యాచ్ అయినా గెలుస్తాడన్న నమ్మకం లేనంతగా..? అతడే కిడాంబి శ్రీకాంత్. మళ్లీఅతడే వార్తల్లో నిలిచాడు. ఆశలు రేపుతున్నాడు. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక ఘనత అతడి కెరీర్‌కు ఊపిరిలూదేదే. భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త శకానికి నాంది పలికేదే.

ఆ డాన్ ను ఓడించి వెలుగులోకి.. బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే ఆల్ టైమ్ గ్రేట్ లిన్ డాన్. అతడిని కొట్టడమంటే (ఓడించడం).. ఓ పెద్ద మాఫియా డాన్ సామ్రాజ్యాన్ని కూలదోసినంత. ఆ పని చేసి 2014లో వెలుగులోకి వచ్చాడు శ్రీకాంత్. ఆ ఏడాది చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో శ్రీకాంత్ ప్రదర్శన ఓ సంచలనం. అనూహ్య విజయాలతో ఫైనల్‌ చేరడమే అద్భుతమంటే.. తుది పోరులో లిన్‌ డాన్‌ను అతడి సొంతగడ్డపైనే వరుస సెట్లలో మట్టికరిపించి ప్రకంపనలు సృష్టించాడు‌. అప్పటికి భారత పురుష షట్లర్లలో ఒక ప్రిమియర్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచిన తొలి ఆటగాడు శ్రీకాంతే. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడుతూ.. 2015లో ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌నూ అతను సొంతం చేసుకున్నాడు.

2017 జూన్‌లో ఇండోనేసియా ఓపెన్‌ గెలిచాక అతను ఆగలేదు. ఆ ఊపులో ఆస్ట్రేలియా ఓపెన్‌ కొన్ని నెలల్లోనే డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించాడు. దీ్ంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్‌ పేరు మారుమోగింది. నంబర్ వన్ అయ్యాడు.ఎంతవేగంగా పైకెదిగాడో.. కేవలం రెండేళ్లలోనే టాప్ ర్యాంక్ కు చేరుకున్న శ్రీకాంత్ అక్కడినుంచి అమాంతం పడిపోయాడు. భారీ అంచనాలు.. గాయాలు.. అదుపు తప్పిన ఆట తో టాపర్ స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. 2018 నుంచి ఏ టోర్నీ బరిలో దిగినా.. తొలి రౌండ్లలో.. ఊరు పేరు లేని ఆటగాళ్ల చేతిలో ఓడిపోతూ నిరాశపర్చాడు. ఈ దశలో మోకాలి గాయానికి చికిత్స.. కరోనాతో ఆటకు దూరమయ్యాడు. 2020 ఒలింపిక్స్కూ ఎంపికకాలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2018-21 శ్రీకాంత్ కెరీర్లో దుర్దినాలు. అయితే, ఇప్పడు గాడిలో పడ్డాడు. గత నెలలో హైలో ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో సెమీస్‌ చేరాడు. ప్రపంచ టోర్నీలో దూకుడైన ఆటతో రజతం సాధించాడు. కెంటొ మొమెట సహా కొందరు అగ్రశ్రేణి ఆటగాళ్లు బరిలో లేకపోవడం శ్రీకాంత్‌కు కలిసొచ్చింది. అయినా.. టోర్నీలో అతడి ప్రదర్శన చూస్తే మళ్లీ లయ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. మరి ఈ ఊపును కొనసాగిస్తూ కెరీర్లో మళ్లీ మరింత ఎత్తుకు ఎదుగుతాడేమో చూద్దాం.రజతమైనా బంగారమే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ఛాంపియన్‌ అవుతాడనుకుంటే..నిరాశే ఎదురైంది.

ఆదివారం జరిగిన ఫైనల్స్ లో శ్రీకాంత్ 15-21,20-22తో లో కీన్‌ యూ (సింగపూర్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. ఓడినా..శ్రీకాంత్‌ది సరికొత్త చరిత్రే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించగా.. రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇక నాలుగేళ్ల క్రితం నాటి 2017 గ్లాస్గో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రదర్శనను భారత్‌ పునరావృతం చేసింది. ఆ టోర్నీలో పి.వి.సింధు రజతం, సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించారు. ఇప్పుడు శ్రీకాంత్‌ రజతం, లక్ష్యసేన్‌ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

సంచలనాలకు కేరాఫ్‌..సింగపూర్‌కు చెందిన యువ బ్యాడ్మింటన్‌ సంచలనం.. లోకీన్‌ యు. అనామకుడిగా బరిలోకి దిగి.. ఏకంగా వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు.కోర్టులో పాదరసంలా కదిలే 24 ఏళ్ల కీన్‌ను మలేసియా దిగ్గజం లీ చోంగ్‌ వీతో పోల్చుతారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగినా.. తొలి రౌండ్‌లోనే ఒలింపిక్‌ చాంప్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ను ఓడించి ప్రకంపనలు సృష్టించాడు. క్వార్టర్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ను ఓడించాడు. సెమీస్‌లో మూడో సీడ్‌ ఆండ్రెస్‌ అంటాన్‌సెన్‌ (డెన్మార్క్‌) మ్యాచ్‌ మధ్యలో తప్పుకోవడంతో యుకు అదృష్టం కలిసొచ్చింది. ఫైనల్లో సాధికారిక ఆటను ప్రదర్శించిన సింగపూర్‌ షట్లర్‌.. చిరస్మరణీయ విజయంతో పసిడి కాంతులీనాడు. 2017లో లిన్‌ డాన్‌పై గెలుపు యు కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయం. గతంలో పీబీఎల్‌లో పుణె ఏసెస్‌కు ప్రాతినిథ్యం వహించాడు.