Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌క‌ధీరుడికి బ్యాడ్మింట‌న్ చాంప్ అభ్య‌ర్థ‌న‌

By:  Tupaki Desk   |   9 Jun 2022 6:34 PM GMT
ద‌ర్శ‌క‌ధీరుడికి బ్యాడ్మింట‌న్ చాంప్ అభ్య‌ర్థ‌న‌
X
క్రీడా బ‌యోపిక్ ల‌కు భార‌త‌దేశంలో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. విజ‌యాల శాతం అసాధార‌ణంగా ఉంది. ఎం.ఎస్.ధోని- మేరీకోమ్- భాగ్ మిల్కా భాగ్ లాంటి బ‌యోపిక్ సినిమాల గొప్ప విజ‌యాలు దీనికి ఉదాహ‌ర‌ణ‌. అందుకే ఇప్పుడు రాజ‌మౌళి లాంటి గొప్ప ద‌ర్శ‌కుడు క్రీడా నేప‌థ్యంలో సినిమా తీస్తే అది  పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నంగా మారుతుంద‌నడంలో సందేహం లేదు. కొద్ది రోజుల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలిసారిగా ప్రతిష్టాత్మక థామస్ కప్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. తెలుగువాడైన కిదాంబి శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్ జట్టుకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయాన్ని యావత్ భార‌త‌దేశం సెల‌బ్రేట్ చేసుకుంది. భారత బ్యాడ్మింటన్ చరిత్ర పుట‌ల్లో స‌రికొత్త అధ్యాయ‌మిది.

తాజాగా ప్ర‌ముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ను ఈ థామస్ కప్ విజయంపై సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అని ప్ర‌శ్నించ‌గా...  అత‌డు సమాధానమిస్తూ తాను తెలుగు వ్యక్తిని కాబట్టి థామస్ కప్ విజయంపై లెజెండరీ ఫిలిం మేకర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం మన తెలుగు సినిమాలన్నీ పాన్ఇండియన్ స్థాయిలో విడుద‌ల‌వుతున్నాయి. విజ‌యాలు అందుకుంటున్నాయి. అంత పెద్ద ద‌ర్శ‌కుడు ఈ ప్రాజెక్టును చేప‌డితే నటీనటుల ఎంపికను అత‌డికే వదిలేస్తాన‌ని కూడా అన్నారు.

అయితే ఎస్.ఎస్.రాజ‌మౌళి అతడి మాట‌ల‌ను విన్నారా లేదో తెలియ‌దు కానీ.. ఏదైనా స్ఫూర్తివంత‌మైన క్రీడా నేప‌థ్య సినిమాని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తే చూడాల‌ని అభిమానులు వేచి చూస్తున్నారు. కంటెంట్ ప‌రంగా ఆద్యంతం ఉత్కంఠ పెంచేలా అత‌డు మూవీని తెర‌కెక్కించి సక్సెస్ ని అందిస్తారు. కంటెంట్ కూడా మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. పైగా ఇలాంటి స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు చైనా మార్కెట్లోనూ బాగా ఎక్కుతాయి. అందుకు దంగ‌ల్ లాంటి స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ విజ‌యం పెద్ద ఎగ్జాంపుల్. అందుకే రాజ‌మౌళి దీనిపై దృష్టి సారిస్తారేమో చూడాలి. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలంటే రాజమౌళి సరైన ఎంపిక అన‌డంలో సందేహం లేదు. సై లాంటి స్పోర్ట్స్ మూవీని తీసిన ఆయ‌న అలాంటి ఒక మూవీ చేసి చాలా కాల‌మైంది. భారీ యాక్ష‌న్ కంటెంట్ తో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలు చేసిన రాజ‌మౌళి ఇక‌పై రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఒక స్పోర్ట్స్ మూవీ తీయాల‌ని ఆకాంక్షిద్దాం.